Francois Bayrou : ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఫ్రాంకోయిస్ బేరౌ‌.. ఈయన ఎవరు ?

by Hajipasha |
Francois Bayrou : ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఫ్రాంకోయిస్ బేరౌ‌.. ఈయన ఎవరు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ఫ్రాన్స్(France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్(Emmanuel Macron) కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ నూతన ప్రధానమంత్రిగా 73 ఏళ్ల ఫ్రాంకోయిస్ బేరౌ‌(Francois Bayrou)ను నియమిస్తున్నట్లు వెల్లడించారు. 2024 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రి మారడం ఇది మూడోసారి. ఫ్రాన్స్‌లోని అధికార, విపక్షాలు కలిసి అవిశ్వాస తీర్మానంపై మూకుమ్మడిగా ఓట్లు వేయడంతో ఇటీవలే మైఖేల్ బార్నియెర్ దేశ ప్రధాని పదవిని కోల్పోయారు. ఈనేపథ్యంలో తనకు సన్నిహితుడైన ఫ్రాంకోయిస్ బేరౌ‌కు ప్రధానమంత్రిగా ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ఛాన్స్ ఇచ్చారు. త్వరలోనే తన మంత్రివర్గం కూర్పుపై నూతన ప్రధాని ప్రకటన చేయనున్నారు. మొత్తం మీద ఫ్రాన్స్‌లో అధికార కూటమికి ప్రాతినిధ్యం వహించే ఏ నేత కూడా ప్రధాని పదవిలో ఎక్కువ కాలం నిలదొక్కుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామాలన్నీ కలిసి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ పదవికి కూడా గండం తెచ్చేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఫ్రాంకోయిస్ బేరౌ‌ ఎవరు ?

ఫ్రాంకోయిస్ బేరౌ‌ విషయానికొస్తే.. ఆయన డెమొక్రటిక్ మూవ్‌మెంట్ పార్టీ వ్యవస్థాపకుడు. అధ్యక్షుడు మక్రాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార కూటమిలో 2017 సంవత్సరం నుంచి ఈ పార్టీ మిత్రపక్షంగా ఉంది. గతంలో ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి మూడుసార్లు ఫ్రాంకోయిస్ పోటీ చేశారు. 2017లో ఈయనను ఫ్రాన్స్ న్యాయశాఖ మంత్రిగా మక్రాన్ నియమించారు. అయితే పార్లమెంటరీ అసిస్టెంట్ల నియామకాల్లో ఫ్రాంకోయిస్ బేరౌ‌కు చెందిన రాజకీయ పార్టీ అవకతవకలకు పాల్పడిందనే అభియోగాలు వచ్చాయి. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ స్కాంలో ఫ్రాంకోయిస్ పాత్ర లేదని దర్యాప్తులో వెల్లడైంది.

Advertisement

Next Story