లిక్కర్ కేసులో సంచలనం.. కేజ్రీవాల్, కవితను ఓకేసారి విచారించనున్న ఈడీ!

by GSrikanth |
లిక్కర్ కేసులో సంచలనం.. కేజ్రీవాల్, కవితను ఓకేసారి విచారించనున్న ఈడీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు తొమ్మిదోసారి నోటీసులు జారీ చేశారు. మార్చి 21న విచారణకు హాజరు కావాలని ఇవాళ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో సమన్లు జారీ చేశారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోనే ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆమె కస్టడీ కొనసాగనుంది.

ఈ క్రమంలో కేజ్రీవాల్‌కు మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఈసారి కేజ్రీవాల్‌ హాజరైతే కవితతో పాటు ఇద్దరినీ ఒకేసారి విచారించే అవకాశం ఉంటుందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. సమన్లకు స్పందించట్లేదని రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌పై ఇప్పటికే రెండుసార్లు ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో నిన్న సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరైన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌పై అభియోగాలన్నీ బెయిల్‌కు అనువుగా ఉన్న సెక్షన్లుగా పేర్కొన్న సీబీఐ కోర్టు.. విచారణ సమయంలోనే ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా.. ఆయనకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story