సీఎం ఇంటికి ఈడీ అధికారులు.. 7గంటల పాటు విచారణ

by Swamyn |
సీఎం ఇంటికి ఈడీ అధికారులు.. 7గంటల పాటు విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్’(ఈడీ) అధికారులు శనివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఇంటికి వెళ్లారు. భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో రాంచీలోని సీఎం నివాసంలోనే ఆయనను విచారించారు. ఈ నెల 16 నుంచి 20 మధ్య ఈ అంశంపై విచారణకు అందుబాటులో ఉండాలని మొదట ఈడీ సీఎంను కోరింది. అయితే, 20న తన నివాసంలోనే స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేయాలని సొరేన్ ఈడీకి తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఎం ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు.. ఆయనను దాదాపు 7 గంటలకు పైగా విచారించారు. ఈ సమయంలో విచారణను నిరసిస్తూ ‘జార్ఖండ్ ముక్తి మోర్చా’(జేఎంఎం) పార్టీ నేతలు, గిరిజన నాయకులు సీఎం ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. రాజ్ భవన్ వైపుగా ర్యాలీ నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో శాంతి భద్రతలను కాపాడేందుకు సీఎం సొరేన్ నివాసం చుట్టూ 1000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. విచారణను అనంతరం సీఎం సొరేన్ స్పందిస్తూ, తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘’నాపై కుట్ర జరుగుతోంది. కానీ, ఆ కుట్రదారుల శవపేటికకు ఆఖరి మేకు మనమే కొడతాము. మనం దేనికీ భయపడం. మీ నాయకుడు(తనను ఉద్దేశించుకుంటూ) బుల్లెట్లనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటాడు. మీరంతా ధైర్యంగా ఉండండి’’ అంటూ తన ఇంటి బయట ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాగా, రాష్ట్ర రాజధాని రాంచీలో అక్రమమైనింగ్, భూ కుంభకోణం కేసులను ఈడీ విచారిస్తోంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సొరేన్‌‌కు ఈడీ ఇప్పటికే ఏడుసార్లు సమన్లు జారీచేయగా విచారణకు హాజరుకాలేదు. చివరగా, ఎనిమిదోసారి తన నివాసంలోనే విచారణకు అంగీకరించారు.


Advertisement

Next Story

Most Viewed