ట్రంప్‌తో జాగ్రత్తగా వ్యవహరించండి!

by John Kora |
ట్రంప్‌తో జాగ్రత్తగా వ్యవహరించండి!
X

- జెలెన్‌స్కీని ముందుగానే హెచ్చరించిన సెనేటర్

- ట్రంప్‌తో వాగ్వివాదానికి దిగొద్దన్న లిండ్సే గ్రాహమ్

- జెలెన్‌స్కీ విధానాన్ని విమర్శించిన లిండ్సే

దిశ, నేషనల్ బ్యూరో: శ్వేతసౌధంలో మీడియా ఎదుటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. ఇద్దరు దేశాధినేతలు ఒకరిపై మరొకరు అగౌరవపూర్వకంగా మాట్లాడుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ సమావేశానికి కొన్ని గంటల ముందు జెలెన్‌స్కీని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ సున్నితంగా హెచ్చిరించారట. 'అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వాగ్వివాదానికి దిగొద్దు. ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించండి. ట్రంప్ ఏమైనా చెప్పినా లేదా ఏమైనా చేసినా మీరు స్పందించకండి' అని గ్రాహమ్ ముందుగానే హెచ్చరించారట. కానీ గ్రాహమ్ హెచ్చరికలను జెలెన్‌స్కీ పట్టించుకోలేదు. ఓవల్ ఆఫీసులో ఇరువురు దేశాధినేత మధ్య జరిగింది చాలా అగౌరవంగా ఉందని గ్రాహమ్ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28న ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో జరిగిన సమావేశానికి ముందు జెలెన్‌స్కీని కొందరు రిపబ్లికన్, డెమోక్రటిక్ సెనేటర్లు కలిశారు. అందులో లిండ్సే గ్రాహమ్ కూడా ఉన్నారు. ఆ సమయంలోనే జెలెన్‌స్కీని హెచ్చరించినట్లు గ్రాహమ్ పేర్కొన్నారు. ఇవ్వాళ ట్రంప్ సంబంధాలను పునరుద్దరించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి మీరు అడ్డు తగలవద్దని హెచ్చరించినట్లు చెప్పారు.

'ఓవల్ ఆఫీస్‌లో నేను చూసింది చాలా అగౌరవంగా ఉంది. ఇక నేను భవిష్యత్‌లో జెలెన్‌స్కీతో మాట్లాడతానని అనుకోవడం లేదు. చాలా మంది అమెరికన్లు కూడా ఇకపై జెలెన్‌స్కీతో సంబంధాలు కోరుకోరు. ఈ సమావేశంలో జెలెన్‌స్కీ అనుసరించిన విధానం బాగాలేదు. జెలెన్‌స్కీ రాజీమానా చేసి చర్చలు జరపగల వ్యక్తిని పంపించాలి' అని లిండ్సే గ్రాహమ్ చెప్పారు. జెలెన్‌స్కీలో మార్పు వస్తేనే తదుపరి చర్చలు ఉంటాయని, లేకపోతే లేదని సెనేటర్ గ్రాహమ్ అన్నారు.

ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య సమావేశం సహృద్భావ వాతావరణంలోనే ప్రారంభమయ్యింది. ఇద్దరు దేశాధినేతలు గౌరవంగానే మాటలు ప్రారంభించారు. ఒకరొకరు అభినందించుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌తో యుద్దాన్ని ఆపే విషయంలో ఆయన ఇచ్చే హామీలను నమ్మలేమని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించిన తర్వాతే సమావేశంలో మాటల వేడి పెరిగింది. ఆ తర్వాత ఇద్దరు నేతలు ఒకరితో ఒకరు విభేదించుకున్నారు. కాగా, ఈ అంశంలో జెలెన్‌స్కీని రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు తీవ్రంగా విమర్శించగా.. యూరోపియన్ యూనియన్ నాయకులు మాత్రం మద్దతుగా నిలిచారు.

Next Story

Most Viewed