నన్ను ఇంకా మాట్లాడనిస్తే.. తట్టుకోలేరు : సీనియర్ లాయర్‌కు సీజేఐ వార్నింగ్

by Hajipasha |
నన్ను ఇంకా మాట్లాడనిస్తే.. తట్టుకోలేరు :  సీనియర్ లాయర్‌కు సీజేఐ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల బాండ్ల అంశంపై సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ అదిశ్ అగర్వాల్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పుపై సుమోటోగా సమీక్ష చేయాలని లాయర్ అదీశ్ అగర్వాల్ కోరడంతో సీజేఐ తీవ్రంగా స్పందించారు. ‘‘మీరు సీనియర్ న్యాయవాది మాత్రమే కాదు.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా!! నా సుమోటో అధికారాలను ప్రశిస్తూ మీరు లేఖ రాశారు. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్ తప్ప మరేంకావు. మేం ఇలాంటి దానిలో భాగం కాలేం.. నన్ను ఇంకేమీ మాట్లాడనివ్వొద్దు.. నేనింకా మాట్లాడితే మీకు చేదుగా అనిపిస్తుంది’’ అని అదీశ్ అగర్వాల్‌కు సీజేఐ వార్నింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా అక్కడే ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అగర్వాల్ అభ్యర్థనను తప్పుపట్టారు. తాము కూడా దీనికి మద్దతు ఇవ్వబోమని కామెంట్ చేశారు.

రాష్ట్రపతికి అదీశ్ లేఖతో కలకలం

ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అదీశ్ అగర్వాల్ రాసిన లేఖ తీవ్ర గందరగోళం సృష్టించింది. ‘‘వివిధ రాజకీయ పార్టీలకు సహకరించిన కంపెనీల పేర్లను బహిర్గతం చేయడం వల్ల కార్పొరేట్లు బలిపశువులు అవుతారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎన్నికల బాండ్ల మొత్తం సమాచారాన్ని విడుదల చేస్తే అంతర్జాతీయ వేదికలపై మనదేశం ఖ్యాతి దెబ్బతింటుంది’’ అని లేఖలో అదీశ్ అభిప్రాయపడ్డారు. ‘‘రాజ్యాంగపరమైన ప్రతిష్టంభనను కలిగించేలా తీర్పులు వెలువరించడానికి సుప్రీంకోర్టును అనుమతించ కూడదు. పార్లమెంట్‌ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా తీర్పులు ఇవ్వడాన్ని అనుమతించకూడదు. చట్టసభలో ప్రజాప్రతినిధులందరూ కలిసి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడాన్ని అనుమతించరాదు.. రాజకీయ పార్టీల పనితీరును ప్రశ్నించేలా తీర్పులు ఇవ్వకూడదు’’ అని రాష్ట్రపతికి రాసిన లేఖలో అదిశ్ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు.

అగర్వాల్ లేఖతో సంబంధం లేదు : సుప్రీం బార్ అసోసియేషన్

అదీశ్ అగర్వాల్ లేఖతో తమకు సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటన చేసింది. రాష్ట్రపతికి లేఖ రాసేందుకు తాము అగర్వాల్‌‌కు అధికారం ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఆ లేఖలో అగర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను తాము సమర్ధించడం లేదని బార్ అసోసియేషన్ వెల్లడించింది. ‘‘అగర్వాల్ రాసిన లేఖలోని వివరాలు సుప్రీంకోర్టు అధికారానికి భంగకరంగా ఉన్నాయి. ఈ చర్యను మేం ఖండిస్తున్నాం’’ అని పేర్కొంటూ బార్‌ అసోసియేషన్‌ తీర్మానం చేసింది.

Advertisement

Next Story