Mamata Banerjee : సీఎం మమత చర్చల్లో పాల్గొనాల్సిందే.. జూనియర్ డాక్టర్ల అల్టిమేటం

by Hajipasha |
Mamata Banerjee : సీఎం మమత చర్చల్లో పాల్గొనాల్సిందే.. జూనియర్ డాక్టర్ల అల్టిమేటం
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్యులతో చర్చలకు సిద్ధమని మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది. కోల్‌కతాలోని బెంగాల్ సెక్రటేరియట్‌ వేదికగా ప్రభుత్వంతో జరిగే చర్చలలో 12 నుంచి 15 మంది వైద్యులు పాల్గొనవచ్చని సూచించింది. ఈమేరకు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ మనోజ్ పంత్ నుంచి జూనియర్ డాక్టర్లకు ఒక ఈమెయిల్ సందేశం వచ్చింది.

మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను జూనియర్ డాక్టర్లు బేఖాతరు చేశారనే అంశాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే వైద్యులతో జరగనున్న చర్చల్లో సీఎం మమతా బెనర్జీ పాల్గొంటారా ? లేదా ? అనే విషయాన్ని బెంగాల్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ప్రస్తావించలేదు. దీనిపై స్పందించిన జూనియర్ డాక్టర్లు .. తమ తరఫున చర్చలకు 30 మంది ప్రతినిధులు హాజరయ్యేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. చర్చలకు తప్పకుండా సీఎం మమతా బెనర్జీ హాజరుకావాలని కోరారు. చర్చల ప్రక్రియను లైవ్‌లో న్యూస్ ఛానళ్లలో ప్రసారం చేయాలన్నారు. ఈ డిమాండ్లకు అంగీకరిస్తే వెంటనే (బుధవారం రాత్రికల్లా) చర్చలకు తాము సిద్ధమని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed