'సెన్సార్ బోర్డుకు బుద్ధుందా..?'.. ఆదిపురుష్ డైలాగులపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం

by Vinod kumar |
సెన్సార్ బోర్డుకు బుద్ధుందా..?.. ఆదిపురుష్ డైలాగులపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
X

అలహాబాద్: ప్రభాస్ రాముడిగా, కృసనన్ జానకిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాలోని డైలాగులపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సెన్సార్ బోర్డుకు బుద్ధుందా. రామాయణం వంటి గొప్ప ఇతిహాసంపై తీసిన సినిమాలో అభ్యంతరకర సంభాషణలు ఉంటే సెన్సార్ షిప్ అనుమతి ఎలా ఇచ్చింది..? భవిష్యత్తు తరాలకు మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు..?’ అని మండిపడింది. అభ్యంతరకర సంభాషణలు ఉండటంతో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ ను తొలగించాలంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. సినిమా దర్శక నిర్మాత విచారణకు హాజరు కాకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. డైలాగులపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ చిత్రం సహ రచయిత మనోజ్ ముంతాషీర్ శుక్లాకు నోటీసులు జారీ చేసింది.

అభ్యంతరకర సంభాషణలను మార్చాం..

‘రామాయణం మనకు ఆదర్శం. ప్రజలు ఇంటి నుంచి బయల్దేరే ముందు రామచరితమానస్ చదువుతారు. హిందూ మతానికి చెందిన ప్రజలు చాలా సహనంతో ఉంటారు. దీన్ని కూడా పరీక్షిస్తారా..?’ అంటూ అలహాబాద్ కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే.. అభ్యంతరకర సంభాషణలను మార్చామని, 26వ తేదీ నుంచి మార్చిన డైలాగ్స్ సినిమాలో యాడ్ అయ్యాయని ఆదిపురుష్ చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘సంభాషణలు సరే.. ఇందులోని సీన్లు ఏం చేస్తారు. కొన్ని సన్నివేశాలు అసభ్యంగా అనిపించాయి.

ఇలాంటి సినిమాలను చూడటం చాలా కష్టం. వాటిపై ఏం చేస్తారో చెప్పండి’ అని కోర్టు ప్రశ్నించింది. సాంకేతికపరంగా మెప్పించిన ఈ చిత్రం కంటెంట్ పరంగా అలరించలేకపోవడంతో కలెక్షన్స్ భారీగా తగ్గాయి. దీంతో టికెట్ ధరను కూడా సగానికి పైగా తగ్గించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఆదిపురుష్’ చిత్రాన్ని నిలిపివేయాలంటూ ప్రధాని మోడీకి ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఇటీవల లేఖ రాసింది. సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed