బిగ్ బ్రేకింగ్ : రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. ఎంపీ సభ్యత్వాన్ని కొట్టేసిన లోక్‌సభ

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-24 09:09:20.0  )
బిగ్ బ్రేకింగ్ : రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. ఎంపీ సభ్యత్వాన్ని కొట్టేసిన లోక్‌సభ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యుడైన రాహుల్‌గాంధీని డిస్‌క్వాలిఫై చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకున్నది. తక్షణం (మార్చి 23, 2023) ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్లు సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇటీవల సూరత్ హైకోర్టు ఆయనను ఒక కేసులో దోషిగా నిర్ధారించి జైలుశిక్షను ఖరారు చేయడంతో దాన్ని పరిగణనలోకి తీసుకుని అనర్హత వేటు వేసినట్లు ఆ ప్రకటనలో సెక్రటరీ జనరల్ స్పష్టం చేశారు.

రాజ్యాగంలోని ఆర్టికల్ 102(1) (ఈ)తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం అనర్హత వేటు వేసినట్లు తెలిపారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ్యుడిగా ఉన్న ఆయనపై అనర్హత వేటు వేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. నిర్దిష్టంగా రాహుల్‌గాంధీని ఎందుకు అనర్హులుగా ప్రకటించాల్సి వచ్చిందో సూరత్ హైకోర్టులో ఇటీవల విచారణకు వచ్చిన కేసు, వెలువరించిన తీర్పును లోక్ సభ సెక్రటేరియట్ కారణంగా చూపింది. ఒకవైపు ఆయన ఇటీవల లండన్‌లో దేశానికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారని బీజేపీ సభ్యులు ఆరోపిస్తూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (రూల్స్)కి సిఫారసు చేసిన నేపథ్యంలో దానిపై ఆయన నుంచి ఇంకా వివరణ రాకముందే సూరత్ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అనర్హత వేటు వేయడం గమనార్హం.

Advertisement

Next Story