India-China: తూర్పు లడఖ్ లో వెనక్కి మరలుతున్న బలగాలు

by Shamantha N |   ( Updated:2024-10-25 06:02:30.0  )
India-China: తూర్పు లడఖ్ లో వెనక్కి మరలుతున్న బలగాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌, చైనాల మధ్య సరిహద్దుల వివాదం కొలిక్కి వచ్చింది. ఇటీవలే ఇరుదేశాల (India-China) మధ్య కీలక ఒప్పందం జరిగింది. దానికి తగినట్లే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ (Disengagement of troops) మొదలైంది. తూర్పు లడఖ్‌ (Ladakh) సెక్టార్‌లోని రెండు కీలకప్రాంతాలైన డెమ్చోక్‌, డెస్పాంగ్‌ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి మరలుతున్నట్లు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం.. ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. చార్దింగ్‌ లా పాస్‌కు సమీపంలోని నదికి పశ్చిమ వైపుగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కివెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరుదేశాల బలగాలు తొలగిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 10- 12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు ఉన్నట్లు సమాచారం. అయితే, బలగాల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత పెట్రోలింగ్ ని తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఇరుదేశాల మధ్య ఒప్పందం

ఇకపోతే, సరిహద్దుల్లో పెట్రోలింగ్ గురించి భారత్- చైనా మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరింది. దీంతో, 2020 గల్వాన్‌ ఘర్షణలకు ముందు నాటి పరిస్థితే ఎల్‌ఏసీ వెంబడి కొనసాగనుంది. ఇరుదేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు వెళ్లే స్వాతంత్ర్యం ఉంటుంది. ఇటీవల జరిగిన బ్రిక్స్‌ సదస్సులో ఈ ఒప్పందాన్ని భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ధ్రువీకరించారు.

Advertisement

Next Story

Most Viewed