కశ్మీరీల హృదయాలను గెలుచుకోవడానికి వచ్చా : ప్రధాని మోడీ

by Hajipasha |
కశ్మీరీల హృదయాలను గెలుచుకోవడానికి వచ్చా : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కశ్మీరీలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీల హృదయాలను గెల్చుకోవడానికి వచ్చానని ఆయన అన్నారు. ‘‘దేశంలోని ఇతర ప్రాంతాల్లో అమలయ్యే చట్టాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోనూ అమలవుతున్నాయి. పేదల సంక్షేమ పథకాలు కశ్మీరీలకు కూడా అందుబాటులోకి వచ్చాయి’’ అని మోడీ పేర్కొన్నారు. కశ్మీర్‌లో దాదాపు రూ.6,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన గురువారం ప్రారంభించారు. వీటిలో వ్యవసాయ రంగం పుంజుకోవడానికి దోహదం చేసే రూ.5వేల కోట్ల అభివృద్ధి పనులు ఉండటం గమనార్హం. అనంతరం శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ఆర్టికల్ 370పై చాలా కాలంపాటు కశ్మీర్‌ ప్రజలతో పాటు యావత్ దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుదోవ పట్టించింది. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వికసిత భారత్‌కు వికసిత జమ్ముకశ్మీర్‌ సాధన చాలా ముఖ్యం. జమ్ముకశ్మీర్‌ మన దేశానికి కిరీటం లాంటిది’’ అని ప్రధానమంత్రి చెప్పారు.

ఆంక్షల నుంచి కశ్మీర్‌కు స్వేచ్ఛ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత అనేక ఆంక్షల నుంచి కశ్మీర్‌కు స్వేచ్ఛ లభించిందన్నారు. ఇప్పుడు కశ్మీర్‌ అభివృద్ధిలో నూతన శిఖరాలను తాకి, స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటోందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగాలు పొందిన దాదాపు వెయ్యి మంది యువతకు ఆయన నియామక పత్రాలను పంపిణీ చేశారు. ‘‘కశ్మీర్​లోని సరస్సుల్లో ఎక్కడ చూసినా కమలం కనిపిస్తుంది. కశ్మీర్ క్రికెట్ లోగోపై కూడా కమలం గుర్తు ఉంది. బీజేపీ గుర్తు కూడా కమలమే. జమ్ముకశ్మీర్‌కు కమలంతో లోతైన అనుబంధం ఉండడం యాదృచ్ఛికమా లేక ప్రకృతి సంకేతమా?’’ అని మోడీ ప్రశ్నించారు. ‘‘జమ్ముకశ్మీర్‌ యువత అన్ని రంగాల్లో ముందడుగు వేయటానికి మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది. కశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లో ఆధునిక క్రీడా సదుపాయాలు కల్పిస్తున్నాం. 17 జిల్లాల్లో బహుళ వినియోగ ఇండోర్‌ స్పోర్ట్స్‌ కేంద్రాలు నిర్మించాం. ఇప్పుడు జమ్ముకశ్మీర్‌ దేశానికి శీతాకాల క్రీడల రాజధానిగా ఎదుగుతోంది’’ అని ఆయన తెలిపారు.

నజీమ్​తో మోడీ సెల్ఫీ

కశ్మీర్​లో నజీమ్​ అనే యువకుడితో ప్రధాని మోడీ సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నా స్నేహితుడు నజీమ్‌తో ఒక సెల్ఫీ. అతడు చేస్తున్న మంచి పనికి నేను ముగ్ధుడిని అయ్యాను. బహిరంగ సభలో అతడు సెల్ఫీ తీసుకుందామని అడిగాడు. అతడిని కలవడం సంతోషంగా ఉంది’’ అని ఎక్స్​లో మోడీ పోస్ట్ చేశారు. ప్రస్తుతం నజీమ్ కశ్మీర్‌లో తేనె వ్యాపారం చేస్తున్నాడని.. వంద మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నాడని ప్రధాని చెప్పుకొచ్చారు. కాగా, ‘దేఖో అప్నా దేశ్ పీపుల్స్ ఛాయిస్ టూరిస్ట్ డెస్టినేషన్ పోల్’, ‘చలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా’ ప్రచారాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రవాస భారతీయులు అపూర్వ భారత్‌ అంబాసిడర్‌లుగా మారి, దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Advertisement

Next Story