పసుపు పచ్చగానే కాదు.. నల్లగా కూడా ఉంటుందని మీకు తెలుసా?

by D.Reddy |
పసుపు పచ్చగానే కాదు.. నల్లగా కూడా ఉంటుందని మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయులు దాదాపు అన్ని రకాల వంటల్లో పసుపును (Turmeric) వేస్తుంటారు. చెప్పాలంటే మన దేశంలో పసుపు లేని వంటిల్లే ఉండదు. పసుపు వంటలకు రుచి, రంగునే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతేకాదు, దీనిని సౌందర్య సాధనంగా, ఔషధాల్లో విరివిగా వాడుతుంటారు. ఇక సాధారణంగా పసుపు అనే మనకు పచ్చ రంగే గుర్తుకు వస్తుంది. కానీ, నల్ల పసుపు (Black Turmeric) కూడా ఉందని చాలా మందికి తెలియదు. ఈ సందర్భంగా నల్ల పసుపు విశేషాలు తెలుసుకుందాం.

నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. అందుకే దీనిని నల్ల పసుపు అని అంటారు. ఇది ఎక్కువగా అస్సాం, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పండుతుంది. నల్ల పసుపును కూడా పూజల్లో వాడతారు. అంతేకాదు, ఇందులోనూ ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నల్ల పసుపులో కర్కుమిన్‌ అనే పదార్థం ఉంటుంది. దీనిలో క్యాన్సర్‌ కణాలను నిరోధించే లక్షణాలు ఉన్నాయి. అలాగే, నల్ల పుసుపు నుంచి తయారు చేసిన పేస్ట్ గాయాలపై అప్లై చేస్తే త్వరగా నయం అవుతాయి. మహిళలకు పీరియడ్స్ సక్రమంగా జరిగేందుకు ఈ నల్ల పసుపు మేలు చేస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది.

ఈశాన్య రాష్ట్రాల్లో విపరీతంగా పండించే ఈ నల్ల పసుపును ప్రస్తుతం రాజస్థాన్‌లోనూ సాగు చేస్తున్నారు. 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే రాజస్థాన్‌ వంటి ప్రదేశాల్లో ఈ రకాన్ని విజయవంతంగా సాగు చేయవచ్చని నిరూపితమైందని.. జైపుర్, సీకర్‌ ప్రాంతాల్లో ఇది బాగా పండుతోందని వ్యవసాయ నిపుణుడు అతుల్‌ గుప్తా తెలిపారు. భారత్‌లో నల్ల పసుపును అనేక ఔషధ కంపెనీలకు సరఫరా చేసి మార్కెట్‌ను పెంపొందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని గుప్తా పేర్కొన్నారు. నల్ల పసుపు పండించే రైతు ఎకరాకు రూ.7లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ సంపాదించొచ్చని ఆయన వెల్లడించారు.

Next Story