పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్..లోకో పైలట్ ఏమన్నారంటే?

by vinod kumar |
పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్..లోకో పైలట్ ఏమన్నారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 25 మందికి పైగా గాయపడ్డారు. చండీగఢ్‌ నుంచి అసోం వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ బుధవారం రాత్రి 11:39 గంటలకు చండీగఢ్‌ నుంచి బయలుదేరింది. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం 2:35 గంటల ప్రాంతంలో యూపీలోని గోండా జిల్లాలో ఉన్న మోతీగంజ్, ఝిలాహి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. రైలులోని 8కోచ్‌లు పట్టాలు తప్పగా..అందులో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్టు గోండా డీఎం నేహా శర్మ తెలిపారు. మరో 25 మందికి తీవ్రగాయాలైనట్టు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రైలు పట్టాలు తప్పిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వారు కేకలు పెట్టారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ప్రమాదం తర్వాత కొన్ని రైళ్ల మార్గాలను అధికారులు దారి మళ్లించారు.

ఘటనపై యూపీ సీఎం యోగీ ఆధిత్య నాథ్ స్పందించారు. ప్రమాదం జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అంతేగాక తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు చొప్పున అందజేయనున్నట్టు తెలిపింది. అలాగే ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం కొనసాగుతున్న కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్) విచారణతో పాటు, పట్టాలు తప్పడానికి దారితీసిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆర్డర్స్ జారీ చేసింది.

ప్రమాదానికి ముందు పేలుడు శబ్దం: లోలో పైలట్

ప్రమాదానికి ముందు తనకు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని లోకో పైలట్ త్రిభువన్ తెలిపారు. రైలు ఆగగానే పలువురు ప్రయాణికులు అద్దాలు పగుళకొట్టి బయటకు దూకినట్టు పేర్కొన్నారు. దీంతో ప్రమాదం జరగడానికి కుట్ర ఏమైనా జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు తమ ప్రభుత్వం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని అసోం సీఎం హిమంత బిస్వ శర్మ తెలిపారు.

మోడీ, రైల్వే శాఖ బాధ్యత వహించాలి: మల్లికార్జున్ ఖర్గే

గోండా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. మోడీ ప్రభుత్వం రైల్వే భద్రతను ఎలా ప్రమాదంలోకి నెట్టిందో చెప్పడానికి ఇది ఉదాహరణ అని విమర్శించారు. ఈ ఘటనకు ప్రధాని మోడీ, రైల్వే శాఖ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయాలని, భద్రతా చర్యలను మెరుగుపర్చాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం స్పందించారు. ఘటన జరగడం బాధాకరమని తెలిపారు. రైల్వే అధికారులు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం తన తీరు మార్చుకోవడం లేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed