శరద్ పవార్‌జీ మార్చి 2న భోజనానికి రాలేను : ఫడ్నవీస్

by Hajipasha |   ( Updated:2024-03-01 12:46:46.0  )
శరద్ పవార్‌జీ మార్చి 2న భోజనానికి  రాలేను : ఫడ్నవీస్
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో మార్చి 2న(శనివారం) ఏం జరగబోతోంది ? మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటుతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పేరు, గుర్తులను కోల్పోయిన రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ఏం చేయబోతున్నారు ? అనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. మార్చి 2న పూణే జిల్లాలోని బారామతిలో ఉన్న తన నివాసంలో జరిగే భోజన కార్యక్రమానికి రావాలని శరద్ పవార్ పంపిన ఆహ్వానాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు అందుకున్నారు. వాళ్లలో ఎవరెవరు ఆ కార్యక్రమానికి వెళ్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ తరుణంలో శుక్రవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తాను శరద్ పవార్ నిర్వహించే కార్యక్రమానికి వెళ్లడం లేదని ప్రకటించారు. ఈమేరకు శరద్ పవార్‌కు ఫడ్నవీస్ ఓ లేఖ రాశారు. ‘‘ఈనెల 2వ తేదీన ఒకదాని తర్వాత ఒకటిగా నేను రోజంతా పలు కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉన్నందున .. మీ ఆహ్వానం ప్రకారం భోజన కార్యక్రమానికి రాలేక పోతున్నాను’’ అని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఇక సీఎం ఏక్‌నాథ్ షిండే, మరో డిప్యూటీ సీఎం, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌‌లు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఇకపై అజిత్ పవార్‌దే అని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. దీంతో శరద్ పవార్ కొత్త గుర్తు, కొత్త పేర్లను పార్టీ కోసం తీసుకోవాల్సి వచ్చింది. బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఈసారి సుప్రియా సూలేపై అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీచేస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో.. బారామతిలోని శరద్ పవార్ నివాసం నుంచి కీలక నేతలకు భోజన ఆహ్వానం అందడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed