Devendra Fadnavis: మహారాష్ట్ర అధికారిక భాష మరాఠీయే.. తేల్చి చెప్పిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

by Shamantha N |
Devendra Fadnavis: మహారాష్ట్ర అధికారిక భాష మరాఠీయే.. తేల్చి చెప్పిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో భాషా వివాదం కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అధికారిక భాష మరాఠీ అని.. రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ దాన్ని నేర్చుకోవాలని స్పష్టం చేశారు. మరాఠీ భాష ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ.. ఆ భాష రాష్ట్ర సంస్కృతి, గుర్తింపులో అంతర్భాగమని పేర్కొన్నారు. మరాఠీని నేర్చుకోవడం, గౌరవించడం ప్రతి పౌరుడి విధి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బాషా విధానాన్ని ప్రశ్నిస్తూ.. ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ ప్రభుత్వ వైఖరిపై స్పష్టత డిమాండ్ చేశారు. దీనిపైనే ఫడ్నవీస్ స్పందించారు. మరాఠీ మహారాష్ట్ర ప్రాథమిక భాష అని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్థిరంగా ఉందని చెప్పుకొచ్చారు. దీనిపైన ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక వారసత్వంలో భాగంగా భాషను గౌరవించడం, సంరక్షించడంపై ప్రభుత్వం నిబద్ధతను కూడా ఆయన పునరుద్ఘాటించారు. అయితే, ఫడ్నవీస్ ప్రకటన తర్వాత, అసెంబ్లీలో బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేల మధ్య తీవ్ర చర్చ జరిగింది.

అర్ఎస్ఎస్ నేత ఏమన్నారంటే?

కాగా.. ఇటీవలే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నాయకుడు భయ్యాజీ జోషి మాట్లాడుతూ.."ప్రతి ఒక్కరూ మరాఠీ తెలుసుకోవలసిన అవసరం లేదు" అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఉండటానికి మరాఠీ అత్యసవరమేమీ కాదన్నారు. ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఫడ్నవీస్ దీనిపైనే వివరణ ఇచ్చారు. స్థానిక భాషను ప్రోత్సహించడానికి బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఐసీఎస్‌ఈ, సీబీఎస్ఈ బోర్డలతో అనుబంధంగా ఉన్న స్కూళ్లలో మరాఠీని తప్పని సరి చేశారు. దీంతో, ఆర్ఎస్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు కారణమయ్యాయి.

Next Story