- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ranya Rao: మహిళకు నిద్రపోయే హక్కులేదా?.. కోర్టులో రన్యారావు

దిశ, నేషనల్ బ్యూరో: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలు, నటి రన్యరావు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. ఆమె తరపున న్యాయవాది కిరణ్ జవాలి వాదనలు వినిపించారు. మార్చి 3న అరెస్టయిన దగ్గర నుంచి రన్యారావును డీఆర్ఐ అధికారులు మానసికంగా వేధించారని.. ఆమెకు నిద్రలేకుండా చేశారని తెలిపారు. నిద్రపోయే హక్కును అధికారులు హరించారని న్యాయస్థానానికి రన్యారావు తరపు న్యాయవాది తెలిపారు. ఒక మహిళకు నిద్రపోయే హక్కు లేదా? అని కోర్టుకు తెలియజేశారు. ఇటీవల రన్యారావుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది. ఆ ఫొటోలో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లుగా కనిపించాయి. కంటి కింద గాయాలు.. ముఖం ఉబ్బినట్టుగా కనిపించింది. దీంతో ఆమెపై డీఆర్ఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, మహిళా సంఘాలు కూడా ధ్వజమెత్తాయి. ఒక మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటి? అని నిలదీశాయి. ఆమె కోరుకుంటే సహాయం చేస్తామని తెలిపాయి.
కన్నీళ్లు పెట్టుకున్న రన్యారావు
ఇదిలా ఉంటే సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. తనను మానసికంగా వేధించారని.. నిద్రలేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తనను మాత్రం కొట్టలేదు గానీ.. మాటలతో హింసించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెను బెదిరించినట్లు కూడా వాపోయింది. అయితే ఈ విషయాన్ని కోర్టుకు ఎందుకు తెలియజేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఆమెకు వైద్య సదుపాయం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు, బెయిల్ పిటిషన్ సందర్భంగా మరోసారి ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కేసును సీబీఐ తన చేతుల్లోకి తీసుకుంది. స్మగ్లింగ్ వెనుక ఎవరున్నది తేల్చే పనిలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఉంది. ఆమెకు మూడు నెలల క్రితమే ఆర్కిటెక్ జతిన్ హుక్కేరితో వివాహమైంది. అయితే అతడితో వ్యాపారలావాదేవీలేవీ లేనట్లు తెలుస్తోంది. మరోవైపు, రన్యారావు స్నేహితుడు తరుణ్ రాజును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్ సమయంలో ఎక్కువగా ఇతడితోనే మాట్లాడినట్లుగా కాల్ డేటాలో కనుగొన్నారు. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడింది. ఆమె దగ్గర నుంచి రూ.12 కోట్లకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె ఇంటి దగ్గర కూడా రూ.3కోట్ల ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.