Delhi rain: ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం.. ఆల్‌ టైం రికార్డు

by Vinod kumar |
Delhi rain: ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం.. ఆల్‌ టైం రికార్డు
X

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో యుమునా నది ఉగ్రరూపం దాల్చింది. యమునా నది నీటిమట్టం.. ప్రమాదకర స్థాయి అయిన 205.33 మీటర్లను దాటి 207.55 మీటర్లకు చేరింది. ఇది ఆల్‌ టైం గరిష్ట స్థాయి. నీటిమట్టం ఈ స్థాయికి చేరడం 1978 తర్వాత ఇదే తొలిసారి. దీంతో హస్తినలో చాలావరకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ఉప్పొంగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

హర్యానా రాష్ట్రం భారీ స్థాయిలో నీటిని దిగువకు వదులుతుండటంతో పాత యుమున వంతెనపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఢిల్లీలో వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ముందుజాగ్రత్త చర్యగా దేశ రాజధానిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అధికారులతో సెక్రటేరియట్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఢిల్లీలో వరద సహాయక చర్యల విషయంలో కేంద్ర సర్కారు జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్‌ కోరారు. యమునా తీరంలోని లోతట్టు ప్రాంత్రాల్లో నివసించే ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన కోరారు. ఎగువ భాగంలోని హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్న జల ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను ఆపితేనే యమునా నది నీటిమట్టం కంట్రోల్ లోకి వస్తుందన్న కేజ్రీవాల్.. ఈ విషయంలో సహకారాన్ని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశానని తెలిపారు.

మిగితా రాష్ట్రాల్లో..

ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు 100 మందికిపైగా మృతిచెందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హిమాచల్‌ ప్రదేశ్‌ లోనే 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఆస్తినష్టమే రూ.4,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. హిమాచల్‌ పర్వత ప్రాంతాల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. గత 24 గంటల్లో వర్షాలు, వరదలతో సంభవించిన పలు ఘటనల్లో పంజాబ్‌లో 15 మంది, ఉత్తరాఖండ్‌లో 9 మంది చనిపోగా 13 మంది గాయపడ్డారు.

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌, చంపావత్‌, ఉదమ్‌సింగ్‌నగర్‌, పౌరీగఢ్‌వాల్‌ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. పంజాబ్‌లో ఘగ్గర్‌ నదిపై ఉన్న మూనక్‌ వద్ద ఓ ఆనకట్ట మూడు చోట్ల దెబ్బతింది. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. మరమ్మతులు నిర్వహించకపోవడం వల్లే ఈ ఆనకట్ట దెబ్బతిన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఘగ్గర్‌ నదిలో ప్రమాదకర స్థాయి కంటే రెండు అడుగులు ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.

Advertisement

Next Story