Delhi Liquor Scam: రూ. 2,002 కోట్ల నష్టమన్న కాగ్.. కాదు కాదు.. రూ. 8,900 కోట్ల నష్టమన్న ఆప్!

by Mahesh Kanagandla |
Delhi Liquor Scam: రూ. 2,002 కోట్ల నష్టమన్న కాగ్.. కాదు కాదు.. రూ. 8,900 కోట్ల నష్టమన్న ఆప్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో సీఎం రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta) మంగళవారం కాగ్ రిపోర్టు(CAG Report) ప్రవేశపెట్టారు. లిక్కర్ స్కాంపై అనేక వివరాలను ఈ నివేదిక బట్టబయలు చేసింది. లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) వల్ల ఢిల్లీ ఖజానాకు రూ. 2,002.68 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలు.. దాని అమలు వరకు అనేక అక్రమాలు, ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని స్పష్టం చేసింది. ఉదాహరణకు, లైసెన్స్‌లు సరెండర్ చేసిన ప్రాంతాల్లో రీటెండరింగ్ చేయకపోవడం వల్ల రూ. 890 కోట్లు, మరికొన్ని చోట్ల జాప్యం కారణంగా జోనల్ లైసెన్సీలకు పరిహారం చెల్లించడం వచ్చిందని, ఈ రూపంలో ఖజానాకు రూ. 941 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది. మరో వివాదాస్పదమైన అంశం ఏమిటంటే.. కొవిడ్ ఆంక్షలు కారణమని చూపుతూ 2021 డిసెంబర్ 28 నుంచి 2022 జనవరి 27 వరకు లైసెన్స్‌దారులకు రూ. 144 కోట్ల మాఫీ చేశారని ఈ నివేదిక తెలిపింది. ఈ మాఫీ ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉండటం మూలంగానూ మరికొంత నష్టం జరిగిందని, జోనల్ లైసెన్సీల నుంచి సరైన రూపంలో సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేయకపోవడం వల్ల రూ. 27 కోట్ల లోటు ఏర్పడిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. మొత్తంగా ఈ లిక్కర్ పాలసీ వల్ల రూ. 2,002.68 కోట్ల నష్టం ఢిల్లీ ఖజానాకు వచ్చిందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఆప్ ప్రభుత్వం 2021, నవంబర్ 17న నుంచి 2022 సెప్టెంబర్‌ వరకు అమలు చేసి పాత విధానానికే మళ్లింది. అప్పటి సీఎస్ నరేశ్ కుమార్ అవకతవలను ఎల్జీ సక్సేనా దృష్టికి తీసుకెళ్లగా ఆయన సీబీఐ దర్యాప్తునకు విజ్ఞప్తి చేశారు. మనీలాండరింగ్ కోణాలూ బయటికి రావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. అవకతవకల ఆరోపణలున్నప్పటికీ ఆప్ ప్రభుత్వం కాగ్ నివేదికలను 2017 నుంచి అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. తాజాగా అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి సమావేశాల్లోనే కాగ్ నివేదికలను ప్రవేశపెడుతున్నది. మంగళవారం ఒక నివేదికను ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం.. మిగిలిన 13 రిపోర్టులనూ ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించింది. అసెంబ్లీ గడువును మార్చి 3 వరకు పొడిగించింది కూడా. ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్, భగత్‌సింగ్ చిత్రపటాలను తొలగించడంతో ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. కాగ్ నివేదికపైనా నిరసనలు చేశారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా 21 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. వారంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే నిరసనకు దిగారు.

కాగ్ నివేదిక ఇంకేం చెప్పింది?

కాగ్ నివేదిక ప్రకారం, లైసెన్స్ జారీ చేయడంలోనూ అప్పటి ఆప్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించింది. తయారీలో ఆసక్తి ఉన్న హోల్‌సేలర్లకు, రిటైలర్లతో సంబంధాలున్న హోల్‌సేలర్లకు లైసెన్స్‌లను ఎక్సైజ్ రూల్ 35ను ఉల్లంఘిస్తూ జారీ చేసింది. ఇది మొత్తం లిక్కర్ సప్లై వ్యవస్థపై కొందరికే గుత్తాధిపత్యాన్ని కల్పించే మార్గాన్ని సుగమం చేసింది. కొందరి యాజమాన్యంలోనే లిక్కర్ తయారీ, హోల్‌సేల్, రిటైల్ అమ్మకాలు నిర్వహించే అవకాశాన్ని ఇచ్చింది. ఇక హోల్‌సేలర్ల మార్జిన్‌ను ఐదు శాతం నుంచి 12 శాతానికి పెంచినా ఖజానాకు ఏమీ ఒరగకపోగా ఆ సొమ్ము లైసెన్సీదారులు మొత్తంగా కాజేసే దారినిచ్చింది. ఈ మార్జిన్ పెంచి ప్రభుత్వ ఆమోదిత ల్యాబ్‌లు ఏర్పాటుతో క్వాలిటీ చెకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఆప్ ప్రభుత్వం చెప్పినా.. ఒక్కటంటే ఒక్క ల్యాబ్ కూడా ఏర్పాటు చేయలేదు. లిక్కర్ జోన్ నడపడానికీ కనీస ఆర్థిక పరిమితులు పెట్టకపోవడంతో బలహీన సంస్థలు, ఒకరే పలు బిడ్డింగ్‌లు వేయడం, గడిచిన మూడేళ్లలో ఏమాత్రం లాభాలు రిపోర్టు చేయని సంస్థలూ బిడ్డింగ్ వేసి లైసెన్స్‌లు పొందాయి. ఫలితంగా చాలా తక్కువ మందే వేరే పేర్లతో ఎక్కువ వాటిని కలిగి ఉండే అవకాశాన్ని కల్పించడంతో ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం, లోపాయికారి ఒప్పందాల అనుమానాలు పొడసూపాయి.

22 లైసెన్సులు.. 849 షాపులు

ఒక్క దరఖాస్తుదారుడు రెండు షాపులనే నిర్వహించాలనే పాత నిబంధన పక్కపెట్టి దీన్ని 54 షాపుల పరిమితికి పెంచారు. గతంలో 377 షాపులు ప్రభుత్వం, 262 షాపులు ప్రైవేటు వ్యక్తులు నడపగా.. కొత్త పాలసీ తర్వాత 849 వెండ్స్‌తో 32 రిటైల్ జోన్లు సృష్టించింది. ఇక్కడ గమ్మతు ఏమిటంటే 849 షాపులున్నా 22 ప్రైవేట్ ఎంటిటీలకే లైసెన్సులు జారీ చేశారు. అంటే చాలా తక్కువ బ్రాండ్లు లేదా సంస్థల లేదా సమూహాల చేతికే ఢిల్లీలో లిక్కర్ వ్యాపార పగ్గాలు వెళ్లేలా ఈ పాలసీ నడిచింది. ఫలితంగా కృత్రిమ కొరత సృష్టించడం, డిమాండ్ పెంచి అత్యధిక ధరలతో విక్రయాలు సాగించి ఆ కొందరికే భారీ ప్రయోజనాలు కల్పించే ముప్పు ఏర్పడింది. దీనికితోడు లిక్కర్ ధరల నిర్ణయాల్లోనూ ఎల్‌1 లైసెన్సీలకు స్వనిర్ణయాధికారాలు ఇచ్చారు. పలుచోట్ల నివాస ప్రాంతాల్లోనూ లిక్కర్ షాపులు ఓపెన్ చేశారు. టెస్టింగ్ రూల్స్‌నూ ఉల్లంఘించారు. అప్పటి ఆప్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసులను తుంగలో తొక్కింది. ఆ ప్రభుత్వం కేబినెట్ ప్రొసీజర్‌నూ ఉల్లంఘించింది.

ఎమ్మెల్సీ కవిత ప్రస్తావన వచ్చిందా?

ఢిల్లీ లిక్కర్ కేసు దేశాన్ని కుదిపేసింది. అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేందర్ సహా పలువురు ఈ కేసులో జైలుకు వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా తిహార్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. గతేడాది ఆగస్టులో బెయిల్ పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత.. తాను నిర్దోషినేనని, ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర అని చెప్పారు. తాజాగా ఈ స్కాంపై కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో ఆమె పేరు ప్రస్తావనకు వచ్చిందా? అనే ఆసక్తి ఏర్పడింది. కాగ్ నివేదికల్లో ఎవరి పేరూ పేర్కొనలేదు. కానీ, ఇండో స్పిరిట్, మహాదేవ్ లిక్కర్స్, బ్రిండ్‌కో సంస్థల పేర్లను కాగ్ పేర్కొంది. ఇండో స్పిరిట్ కంపెనీతో కవితకు సంబంధాలున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కవిత, మరో పార్ట్‌నర్‌కు కలిపి ఇండో స్పిరిట్‌లో 65 శాతం వాటా ఉన్నట్టు గతంలో ఈడీ ఆరోపించింది. ఈ ఇండో స్పిరిట్, మరో రెండు హోల్‌సేలర్ సంస్థలే ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌ను చాలా వరకు నియంత్రించాయని కాగ్ తెలిపింది. మొత్తం సప్లైలో 71 శాతం ఈ మూడు సంస్థలే కంట్రోల్ చేశాయని.. ఆ స్థాయిలో ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో ఇవి గుత్తాధిపత్యం పొందాయని వివరించింది.

బీజేపీ ఏమన్నది?

కాగ్ నివేదిక కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, మొత్తంగా ఆప్ అసలు రూపాన్ని ఆవిష్కరించిందని బీజేపీ నేతలు విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఆప్ కాగ్ నివేదికలను ఏళ్ల తరబడి తొక్కిపెట్టిందని, నేడు విధాన సభ ముందుకు వచ్చాయని వివరించారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల సొమ్ము ఎలా దోచుకున్నాడో.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశాడో ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. కాగ్ నివేదికలు ప్రవేశపెట్టిన తర్వాత వాటిపై చర్చ జరపాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం పర్వేశ్ సింగ్ స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ బ్రోకర్ అని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు.

ఎల్జీ, ఈడీ, సీబీఐ వల్ల రూ. 8,900 కోట్ల నష్టం: ఆప్

ఆప్ నేతలు(AAP) కాగ్ నివేదికలోని ఏడు చాప్టర్‌లలో ఆరు చాప్టర్‌లు పాత పాలసీకి సంబంధించినవేనని, ఒక్క చాప్టర్ మాత్రమే కొత్త పాలసీకి సంబంధించిదని చెప్పారు. పాత పాలసీలో లోపాలున్నాయని ఈ నివేదిక తెలిపిందని, అందుకే కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త పాలసీ(New Liquor Policy)ని తెచ్చిందని మాజీ సీఎం అతిశీ వివరించారు. కొత్త పాలసీని అమలు చేయడంలో లెప్టినెంట్ గవర్నర్, సీబీఐ, ఈడీలు ఆటంకాలు కల్పించడం వల్ల యేటా రూ. 8,900 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. పాత విధానంలోని లోపాలు అక్రమ మద్యం రవాణాకు దారి తీస్తున్నదని గుర్తించిన తర్వాతే కొత్త పాలసీని రూపొందించాలని ఆప్ నిర్ణయించిందని చెప్పారు. కొత్త పాలసీ పారదర్శకంగా ఉండి రెవెన్యూ వసూళ్లకు ఉపకరించేదని పేర్కొన్నారు.

Next Story

Most Viewed