ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు: చార్జిషీట్‌లో ఇద్దరు ఎంపీల పేర్లు ప్రస్తావించిన ఈడీ

by GSrikanth |
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు: చార్జిషీట్‌లో ఇద్దరు ఎంపీల పేర్లు ప్రస్తావించిన ఈడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటు సభ్యుల పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఆ పార్టీ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్‌చద్దాలు పలు సమావేశాల్లో పాల్గొన్నారని, ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారం వారికి కూడా తెలుసని ఈడీ పేర్కొన్నది. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన ఈడీ వారు వెల్లడించిన అంశాలను చార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి సీ.అరవింద్‌ గతేడాది డిసెంబరు 23న ఇచ్చిన వాంగ్మూలంలో ఆప్ ఎంపీ రాఘవ్‌చద్దా పేరును తెరపైకి తెచ్చారు. ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పాలసీ గురించి చర్చించేటప్పుడు విజయ్‌నాయర్‌తో పాటు ఆప్ నేత విజయనాయర్, పంజాబ్ ఎక్సయిజ్ అధికారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఆ చర్చల్లో రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నట్లు తెలిపారు.

రాఘవ్‌చద్దా దీని గురించి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఈడీ తన చార్జిషీట్‌లో పేరును మాత్రమే ప్రస్తావించిందని, కానీ పాలసీ రూపకల్పనలో ఎలాంటి ప్రమేయం ఉన్నదో స్పష్టత ఇవ్వలేదని, పైగా నిందితుడిగా చేర్చలేదని, వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ పేరును కూడా ఈడీ ఆ చార్జిషీట్‌లో ప్రస్తావించింది. ఇదే కుంభకోణంలో సీబీఐ నమోదు చేసిన కేసులో అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరా స్టేట్‌మెంట్‌లో ఎంపీ సంజయ్ సింగ్ పాత్రపై కామెంట్లు చేశారు. కేజ్రీవాల్ నివాసంలో సంజయ్ సింగ్ మీటింగులో పాల్గొన్నారని, లిక్కర్ వ్యాపారుల నుంచి పార్టీ ఫండ్‌ విషయమై సూచనలు చేశారని, చివరకు రూ. 82 లక్షల మేర చెక్కును తానే ఇచ్చానని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరు రాగా తాజాగా ఇద్దరు ఎంపీల పేర్లు కూడా ఈడీ చార్జిషీట్‌లో కనిపించడం ఆమ్ ఆద్మీ పార్టీలో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed