'సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమి ఉండవు'.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు

by Prasad Jukanti |   ( Updated:2024-04-09 10:57:42.0  )
సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమి ఉండవు.. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు
X

దిశ, డైనమిక్ బ్యూరో:లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ అరెస్ట్ ను హైకోర్టు సమర్ధించింది. తన అరెస్ట్, ట్రయల్ కోర్టు కస్టడీని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అంటూ ఉండదని చట్టం ముందు అందరూ సమానమే అని వ్యాఖ్యానించింది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమి ఉండవని, విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనక్కరలేదని స్పష్టం చేసింది. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని తెలిపింది.ఈ కేసులో కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లోని జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

కాగా ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఇవాళే పొడిగించింది. ఆమె కస్టడీ ముగియడంతో ఇవాళ ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. లిక్కర్ మద్యం పాలసీ కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని ఇటువంటి కీలక సమయంలో కవితకు బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ వాదనలు వినిపించింది. దీంతో ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ నెల 23 వరకు కస్టడీ పొడిగించింది

Advertisement

Next Story