ఎన్నికల ప్రచారానికి మధ్యంతర బెయిల్ కోరుతూ మనీశ్ సిసోడియా పిటిషన్

by S Gopi |
ఎన్నికల ప్రచారానికి మధ్యంతర బెయిల్ కోరుతూ మనీశ్ సిసోడియా పిటిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం ఎక్సైజ్ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి శుక్రవారం సిసోడియా పిటిషన్‌ను స్వీకరించిన ప్రత్యేక కోర్టు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారానికి వెళ్లేందుకు మద్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. సిసోడియా అభ్యర్థనపై స్పందన తెలియజేయాలని, తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. గతేడాది ఫిబ్రవరి ఆఖరులో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈడీ కూడా ఆయనను కస్టడీలోకి తీసుకుంది. తీహార్ జైల్లో ఉన్న సిసోడియా ఇప్పటికే పలుమార్లు బెయిల్ కావాలని పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఊరట లభించలేదు. ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్)కి సమస్యలు తలెత్తాయి. కేజ్రీవాల్‌తో పాటు కీలక నేతలు జైల్లో ఉండటంతో ప్రచారం తగ్గింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు తమ నేతలపై తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆప్ బీజేపీపై ఆరోపణలు చేస్తోంది.

Advertisement

Next Story