సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ నిరాహార దీక్ష..

by Vinod kumar |
సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ నిరాహార దీక్ష..
X

రాజస్థాన్: కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సొంత ప్రభుత్వంపై నిరసన చేపట్టిన పైలట్.. నిరహార దీక్ష స్థలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎలాంటి గుర్తులు లేకుండా జాగ్రత్తపడ్డారు. తన మద్దతుదారులతో కలిసి రాజస్థాన్ రాజధాని జైపూర్‭లోని షహీద్ స్మారక్ స్థల్ వద్ద ఈ నిరాహార దీక్ష చేశారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అవినీతిపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయమై ఏడాదిన్నర క్రితమే తాను ముఖ్యమంత్రికి లేఖ రాసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని పైలట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. మేము అధికారంలోకి రాగానే 45 వేల కోట్ల రూపాయల మైనింగ్ స్కాం మీద విచారణ చేస్తామని విపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చాము.

కానీ ప్రభుత్వ కాల పరిమితి పూర్తి కావస్తోంది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని పైలట్ మండిపడ్డారు. అయితే పైలట్ చేపట్టిన ఈ దీక్షపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద భావిస్తున్నట్లు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సుఖ్వీందర్ సింగ్ రాంధావా అన్నారు. సొంత ప్రభుత్వంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చి చర్చించాలని.. ఇలా మీడియా ముందుకు ప్రజల ముందుకు వెళ్లి పార్టీని తక్కువ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. ‘నేను ఐదేళ్ల నుంచి ఏఐసీసీ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా ఉన్నాను. కానీ పైలట్ ఎప్పుడూ ఈ విషయాలను నా దృష్టికి తీసుకురాలేదు.

నేను ఇప్పటికీ చెప్తున్నాను. సామరస్యపూర్వకంగా చర్చించుకుంటే పోతుంది’ అని రాంధావా అన్నారు. రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వివాదమే ఎక్కువగా తెరపైకి వస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. అవకాశం దొరికినప్పుడు ఇద్దరు నేతలు ఏదో ఒక వివాదానికి తెరలేపుతూనే ఉన్నారు. ఇతర పార్టీల అవినీతిపై ఆరోపణలు చేయడం రాజకీయాల్లో సహజమే. కానీ దానిపై చర్యలు తీసుకోవడం లేదని సొంత ప్రభుత్వంపై ఆ పార్టీ నేత పైలట్ ధ్వజమెత్తడం గమనార్హం.

Advertisement

Next Story