Manipur violence: మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన.. నల్లదుస్తుల్లో హాజరైన విపక్ష ఎంపీలు

by Vinod kumar |
Manipur violence: మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన.. నల్లదుస్తుల్లో హాజరైన విపక్ష ఎంపీలు
X

న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండపై పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గురువారం పలు బిల్లుల ఆమోదం మినహా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే ఉభయసభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి. విపక్ష సభ్యులు కొందరు నల్లదుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. విపక్ష ఎంపీలు నల్లదుస్తులు ధరించి రావడాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. తీవ్రమైన విషయాలపై కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతోన్న ప్రతిష్ఠను ఈ నల్లదుస్తులు ధరించిన వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. వారి గతం, వర్తమానం, భవిష్యత్తు అంధకారంలో ఉందని.. కానీ మేం వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆశిస్తున్నామని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే.. స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. తమ స్థానాల నుంచి లేచి వెల్ లోకి దూసుకెళ్లిన విపక్ష సభ్యులు.. "ఇండియా ఫర్ మణిపూర్" అనే ప్లకార్డులను ప్రదర్శించారు.

తక్షణం మణిపుర్ అంశంపై చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. గందరగోళం నెలకొనడం వల్ల స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 2గంటల వరకు లోక్‌సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ సమావేశం కాగానే విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరగడం వల్ల సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు. 3గంటలకు తిరిగి సమావేశం కాగా.. ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టారు. విపక్షాల నినాదాల మధ్యే వాటిని ఆమోదించిన తర్వాత లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మణిపూర్ లో చోటుచేసుకుంటున్న అకృత్యాలను నిరసించేందుకు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా ఉన్నామని తెలిపేందుకే నల్ల దుస్తులు ధరించామని ఆప్‌ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడించారు. మణిపూర్ ముఖ్యమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు.

రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు మణిపుర్ అంశంపై చర్చకు పట్టుపట్టారు. అయితే రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ అనుమతితో విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశాంగ విధానంపై ఓ ప్రకటన చేశారు. విపక్షాల నినాదాల మధ్యే ఆయన ఈ ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా విపక్షాలు ఆందోళన విరమించకపోవటంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ వాయిదాపడింది. మళ్ళీ సభ ప్రారంభమయ్యాక విపక్షాలు వాకౌట్‌ చేశాయి.

పీయూష్‌ గోయల్‌ వర్సెస్ అధిర్‌ రంజన్‌ చౌదరి..

విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ప్రకటన చేస్తుండగా అడ్డుకున్న అంశంపై లోక్‌సభలో గురువారం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది . దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తమని అధిర్‌ రంజన్‌ చౌదరికి లోక్ సభ స్పీకర్ కోరారు.. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ జోక్యం చేసుకొని ఇంతకుముందు విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనకు అంతరాయం కలిగించినందుకు నిరసనగా కాంగ్రెస్ నాయకుడిని మాట్లాడటానికి అనుమతించనని చెప్పారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు "ఇండియా, ఇండియా" నినాదాలు చేశారు. ఆ వెంటనే జన్ విశ్వాస్ బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో గోయల్ మాట్లాడుతూ.. "తమ నల్లధనం, నల్ల పనులను నల్ల దుస్తుల మాటున దాచాలనుకుంటున్నారు" అని ప్రతిపక్ష సభ్యులపై విరుచుకుపడ్డారు.

అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉండగా బిల్లులను ఆమోదించొద్దు : కాంగ్రెస్

"ఇండియా" కూటమి లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉండగా బిల్లులను ప్రభుత్వం ఆమోదించడం హాస్యాస్పదమని కాంగ్రెస్‌ పేర్కొంది. ఇది పార్లమెంట్ నియమాలకు విరుద్ధమని తెలిపింది. ఆ తీర్మానంపై చర్చ జరిగే వరకు ఎటువంటి శాసన వ్యవహారాలు చేయకూడదని కోరింది. మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయనందుకు నిరసనగా గురువారం రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాన్ని "ఇండియా" ప్రతిపక్ష కూటమి బహిష్కరించింది. రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌ ఉపరాష్ట్రపతి సహా 11 మంది సభ్యులు ఉన్నారు.

ప్రతిపక్ష ఫ్రంట్ "ఇండియా" నుంచి ముగ్గురు ఎంపీలు (జైరామ్ రమేష్, మీసా భారతి,డెరెక్ ఓబ్రెయిన్) కూడా ఈ కమిటీలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లుపై బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చెందిన జేడీ(యూ) పార్టీ తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసింది. జూలై 27 నుంచి ఆగస్టు 11 వరకు సభకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వారికి సూచించారు. "ఇండియా" కూటమిలో ఉన్న పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లు శుక్రవారం (జూలై 28న) రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

సినిమాటోగ్రఫీ చట్టం-1952కి సవరణలు, మూవీ ఇండస్ట్రీలో పైరసీ సమస్యకు చెక్ పెట్టడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు-2023ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రెండు గంటల చర్చ తర్వాత దీన్ని ఆమోదించారు. ఈ బిల్లు ద్వారా చట్టంలో చేసిన సవరణల వల్ల సినిమాల అనధికార రికార్డింగ్, ప్రదర్శనలకు చెక్ పడుతుంది. దీని ప్రకారం సినిమాలను పైరసీ చేసే వ్యక్తులకు మూడేళ్ల శిక్ష విధించనున్నారు. సినిమా బడ్జెట్​లో ఐదు శాతాన్ని జరిమానాగా విధించనున్నారు. సినిమాలను సర్టిఫై చేయడానికిగానూ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

సర్టిఫై చేసే క్రమంలో సినిమాలో మార్పులు, తొలగింపులను సూచించే అవకాశం కూడా ఉంటుంది. అభ్యంతరకరంగా ఉన్న సినిమాలకు పర్మిషన్స్ ను తిరస్కరించే అధికారం కూడా బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ కు ఉంటుంది. వయసు ఆధారంగా ఇచ్చే సెన్సార్ సర్టిఫికేషన్​లో కేటగిరీలు తీసుకురావాలని ఈ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. 'యూఏ7 ప్లస్', 'యూఏ 13 ప్లస్', 'యూఏ 16ప్లస్' కేటగిరీలను తీసుకురావాలని ప్రతిపాదించారు.

ఈ బిల్లును ఆమోదించే క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. "ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే.. వాళ్ళు సినిమా పరిశ్రమకు అనుకూలంగా లేరని అర్ధమవుతోంది. భారతదేశం కళా రంగంలో ఎదగాలని కూడా వాళ్ళు కోరుకోవడం లేదు" అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

ఈ బిల్లులకు ఆమోదం..

అటవీ సంరక్షణ (సవరణ) బిల్లు-2023ను లోక్‌సభ ఆమోదించింది. వ్యాపార నిర్వహణకు సంబంధించి కొన్ని చిన్న తప్పులను నేరజాబితాలో నుంచి తొలగించేందుకు తీసుకొచ్చిన 2023-జన్ విశ్వాస్ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. పర్యావరణం, వ్యవసాయం, మీడియా, పరిశ్రమలు, వాణిజ్యం, ప్రచురణ, ఇతర డొమైన్‌లను నియంత్రించే 42 చట్టాల్లోని 183 నిబంధనలను ఇది సవరించనుంది. మణిపూర్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల మధ్య "ఆఫ్‌షోర్ ఏరియాస్ మినరల్ లా" చట్టాన్ని సవరించే బిల్లును గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టారు.

రాజ్యసభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేసిన తర్వాత రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్) ఆర్డర్ (మూడో సవరణ) బిల్లు-2022ను ఆమోదించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో పలు మార్పులు చేసిన తర్వాత ఇటీవల కేంద్ర మంత్రివర్గం దాన్ని ఆమోదించింది. అయితే ఆ సవరణలు లేకుండానే బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడతారని మీడియాలో వార్తలు వచ్చినందుకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు.

Advertisement

Next Story