మీడియాకు ముందు ప్రత్యక్షమైన ‘భోలే బాబా’.. హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే?

by Shamantha N |
మీడియాకు ముందు ప్రత్యక్షమైన ‘భోలే బాబా’.. హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: హత్రాస్‌ లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయిన ఘటనపై భోలేబాబా తొలిసారిగా స్పందించారు. తొక్కిసలాట తర్వాత పరారీలో ఉన్న ఆయన.. తొలిసారిగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. హత్రాస్ ఘటన తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. “ఈ బాధను భరించే శక్తిని దేవుడు మాకు ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ పై నమ్మకం ఉంచండి. గందరగోళం సృష్టించిన వారెవరైనా విడిచిపెట్టరనే విశ్వాసం నాకు ఉంది. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి జీవితాంతం అండగా నిలబడాలని, వారికి సాయం చేయాలని నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించా” అని వీడియో సందేశం పంపారు.

దేవప్రకాష్ మధుకర్ అరెస్టు

హత్రాస్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడిగా భోలే బాబా అనుచరుడు దేవప్రకాష్ మధుకర్‌ పేరుని ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చారు. దేవప్రకాష్ మధుకర్ ని ఢిల్లీలో యూపీ ఎస్టీఎప్ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై భోలే బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్ స్పందించారు. దేవప్రకాష్ ను పోలీసులు అరెస్టు చేయలేదని.. ఆయన పోలీసులకు లొంగిపోయారని తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. అందుకే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయబోమని పేర్కొన్నారు. మేం చేసిన నేరం ఏంటి? అని అడిగారు. దేవప్రకాష్ ఇంజినీర్, హార్ట్ పేషంట్ అని ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని.. అందుకే విచారణ చేరేందుకు లొంగిపోయినట్లు తెలిపారు. హత్రాస్ తొక్కిసలాట కేసు దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు 90 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది. ఇకపోతే, 'సత్సంగ్' ఆర్గనైజింగ్ కమిటీలో భాగమైన ఇద్దరు మహిళా వాలంటీర్లు సహా మరో ఆరుగురిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed