Cyclone Asna: అస్నా తుపానుగా మారిన అల్ప పీడనం.. 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి !

by vinod kumar |
Cyclone Asna:  అస్నా తుపానుగా మారిన అల్ప పీడనం.. 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి !
X

దిశ, నేషనల్ బ్యూరో: అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అస్నా తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇది రానున్న రెండు రోజుల్లో భారత తీరానికి దూరంగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావంతో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేగాక గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే చాన్స్ ఉందని తెలిపింది. తీర ప్రాంతమైన కర్ణాటకకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, కొంకణ్-గోవా, మధ్య మహారాష్ట్రలకు సెప్టెంబర్ 2 3 తేదీల్లో ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది.

కాగా, 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడిన తుపాను ఇదే కావడం గమనార్హం. 1976 ఆగస్టులో ఏర్పడిన తుపాన్ మళ్లీ 2024 ఆగస్టు 30న సుమారు 48ఏళ్ల తర్వాత ఏర్పడింది. అంతేగాక 1891 నుంచి 2023 మధ్య అరేబియా సముద్రంలో ఆగస్టులో కేవలం మూడు తుపానులు మాత్రమే సంభవించాయి. 1944,1964, 1976లలో తుపానులు ఏర్పడ్డాయి. మరోవైపు గత నాలుగు రోజులుగా గుజరాత్‌లో వర్షాల కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 18,000 మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

Advertisement

Next Story