Red Fort : స్వాతంత్య్ర దినోత్సవాల్లో రాహుల్‌గాంధీకి ఐదో వరుసలో సీటు.. కాంగ్రెస్ భగ్గు

by Hajipasha |
Red Fort : స్వాతంత్య్ర దినోత్సవాల్లో రాహుల్‌గాంధీకి ఐదో వరుసలో సీటు.. కాంగ్రెస్ భగ్గు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఐదో వరుసలో సీటును కేటాయించారు. సీటు కేటాయింపులో రాహుల్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన విపక్ష నేతకు సీటు కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది ప్రధాని మోడీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినతే మండిపడ్డారు. చిన్న మనసు కలిగిన వాళ్లపై పెద్ద అంచనాలు పెట్టుకోవడం వ్యర్థ విషయమని వ్యాఖ్యానించారు. ఈవిధంగా తన ఫ్రస్ట్రేషన్‌ను ప్రధాని మోడీ బయటపెట్టుకున్నారని ఆమె చెప్పారు. ఏం చేసినా ప్రజల సమస్యలపై గళమెత్తే విషయంలో రాహుల్ గాంధీని ఎవరూ ఆపలేరని సుప్రియా శ్రినతే స్పష్టం చేశారు.

‘‘ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక సంప్రదాయాలు, విపక్ష నేతపై మోడీ సర్కారుకు గౌరవం లేదని ఈ ఘటనతో తేటతెల్లమైంది’’ అని పేర్కొంటూ ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఒలింపియన్లను గౌరవించేందుకే రాహుల్ గాంధీని వెనుక సీట్లలో కూర్చోబెట్టామంటూ రక్షణ శాఖ విడుదల చేసిన వివరణను సుప్రియా తప్పుపట్టారు. దాన్ని తెలివితక్కువ ప్రకటనగా అభివర్ణించారు. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా స్పందిస్తూ.. ‘‘లోక్‌సభలో ప్రధాన మంత్రి తర్వాతి హోదా విపక్ష నేతదే. అలాంటప్పుడు జాతీయ పర్వదినం రోజున మీరెందుకు రాజకీయం చేస్తున్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ జీ ? మీరలా చేస్తారని మేం అనుకోలేదు’’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story