కాంగ్రెస్ త్వరలోనే అంతం కాబోతున్నది: డీపీఏపీ చీఫ్ గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు

by samatah |
కాంగ్రెస్ త్వరలోనే అంతం కాబోతున్నది: డీపీఏపీ చీఫ్ గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ మాజీ నేత, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ త్వరలోనే అంతం కాబోతుందని, కొంతమంది బలహీనతలు, అహంకారమే దానికి కారణమని వ్యాఖ్యానించారు. పార్టీ ఈ పరిస్థితికి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ పార్టీని వీడటం కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పారు. ఆయన పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది పార్టీని వీడనున్నట్టు సమాచారం తనకు ఉందని వెల్లడించారు. ‘నా రాజకీయ జీవితం మహారాష్ట్ర నుంచి ప్రారంభమైంది. నేను అక్కడ నుంచి లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికయ్యాను. దేశంలో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేసే సత్తా మహారాష్ట్రకే ఉంది. ఉత్తరప్రదేశ్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి రావడం ఆందోళన కరం’ అని తెలిపారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ అగ్రనేతలు మిలింద్ డియోరా, బాబా సిద్ధిక్, అశోక్ చవాన్‌లు పార్టీకి రిజైన్ చేశారు.

తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కార్యాచరణ అవసరం

ఆర్టికల్ 370 అంశంపై ఇతర పార్టీ నేతల నుంచి వ్యతిరేకత లేకపోవడం సరైంది కాదన్నారు. కశ్మీర్‌లో డీపీఏపీ అధికారంలోకి వస్తే..ప్రజల హక్కుల రక్షణకు కృషి చేస్తామన్నారు. భూమి, ఉద్యోగ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. గత రెండు నెలల్లో పూంచ్, శ్రీనగర్‌లలో జరిగిన ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ, జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్ హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి హేయమైన చర్యలకు వ్యతిరేకంగా ఒక దృఢమైన వైఖరి అవసరమని స్పష్టం చేశారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ఈ ప్రాంతంలో శాంతిని కొనసాగించడానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story