కాంగ్రెస్‌కు ‘ఇండోర్’ షాక్.. ‘సూరత్‌’లా ఏకగ్రీవం ఎందుకు కాలేదంటే..

by Hajipasha |
కాంగ్రెస్‌కు ‘ఇండోర్’ షాక్.. ‘సూరత్‌’లా ఏకగ్రీవం ఎందుకు కాలేదంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం మధ్యప్రదేశ్‌లో సంచలన పరిణామం జరిగింది. ఇండోర్ లోక్‌సభ స్థానానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ అకస్మాత్తుగా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా, మంత్రి కైలాష్‌ విజయ వర్గీయలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి అక్షయ్ బామ్ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. నామినేషన్ విత్ డ్రా అనంతరం ఆయన నేరుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ షాకింగ్ మలుపుతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతింది. ముందుజాగ్రత్త చర్యగా మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలతో నామినేషన్లు వేయించినప్పటికీ అవి కూడా తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఈసారికి ఇండోర్ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు అభ్యర్థులెవరూ లేని పరిస్థితి ఎదురైంది.

అక్కడ టైం దొరికింది.. ఇక్కడ టైం దొరకలేదు

ఇటీవలే గుజరాత్‌లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడ పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి సహా మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకొని బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహాయం చేశారు. ఇండోర్‌లోని పరిస్థితి ఇందుకు పూర్తి విభిన్నం. ఎందుకంటే.. ఇక్కడ మొత్తం 33 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో నాలుగు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ తన నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థితో కలుపుకొని మొత్తం 28 మంది పోటీలో మిగిలారు. సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయ్యాక .. ఇతర అభ్యర్థులతో బీజేపీ అభ్యర్థి రాజీ చర్చలు చేసుకోవడానికి మధ్యలో ఒక రాత్రి సమయం దొరికింది. కానీ ఇండోర్‌లో సోమవారమే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. దీంతో బీఎస్పీ, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులను కలుపుకొని మొత్తం 28 మంది పోటీ చేస్తారు.

బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చే అవకాశం..

ఏదిఏమైనప్పటికీ ప్రధాన పార్టీ కాంగ్రెస్ రేసులో లేకపోవడం అనేది బీజేపీకి ఇండోర్‌లో కలిసొచ్చే అవకాశం ఉంది. ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో లాల్వానీ దాదాపు 5.4 లక్షల ఓట్లు సాధించి గెలిచారు. ఇక మిగిలిన అభ్యర్థుల్లో ఎవరైనా బలమైన నేతను ఎంపిక చేసి.. కాంగ్రెస్ పార్టీ తమ మద్దతును ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ ఏడాది మార్చిలోనే అక్షయ్‌ను ఇండోర్ లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆదివారం దాకా ఆయన ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచార ఘట్టానికి మరో 14రోజుల సమయమున్న వేళ అక్షయ్ బామ్ బీజేపీలోకి జంప్ కావడం, నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ కలకలం రేగింది. ‘‘ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్‌కు బీజేపీలోకి స్వాగతం’’అంటూ మంత్రి కైలాష్ విజయవర్గీయ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

Advertisement

Next Story