పరిహారానికి, బీమాకి మధ్య వ్యత్యాసం ఉంది.. కేంద్రంపై ఫైర్ అయిన రాహుల్ గాంధీ

by Shamantha N |
పరిహారానికి, బీమాకి మధ్య వ్యత్యాసం ఉంది.. కేంద్రంపై ఫైర్ అయిన రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: విధి నిర్వహణలో అమరుడైన ‘అగ్నివీరుడు’ అజయ్ కుమార్ కుటుంబానికి ఎలాంటి పరిహారం అందలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. పరిహారానికి, ఇన్సూరెన్స్ కు మధ్య తేడా ఉంటుందని అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ఓ వీడియోని షేర్ చేశారు. ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.50 లక్షలు, ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ నుంచి రూ.48 లక్షలు అందినట్లు అజయ్ కుమార్ తండ్రి అందులో తెలిపారు. ఈ వీడియోని షేర్ చేస్తూ.. అమరవీరుడి ఫ్యామిలీకి కేంద్రం నుంచి పరిహారం లేదా ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు. పరిహారానికి, ఇన్సూరెన్స్ కు మధ్య వ్యత్యాసం ఉందని అన్నారు. అమరవీరుడి కుటుంబానికి బీమా కంపెనీ ద్వారా మాత్రమే చెల్లింపు జరిగిందని పేర్కొన్నారు.

అమరవీరుల పట్ల మోడీ వివక్ష చూపుతున్నారు

దేశం కోసం ప్రాణత్యాగం చేసే ప్రతి అమరవీరుడి కుటుంబాన్ని గౌరవించాలని రాహుల్ గాంధీ హితవు పలికారు. కానీ మోడీ ప్రభుత్వం అమరవీరుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏం చెప్పినా ఊరుకునేది లేదని.. ఇది దేశభద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. పదే పదే ఈ సమస్యను లేవనెత్తుతానని స్పష్టం చేశారు. ఇకపోతే, రాహుల్ షేర్ చేసిన వీడియోలో.. కేంద్రం నుంచి ఎలాంటి డబ్బు అందలేదని అజయ్ కుమార్ తండ్రి పేర్కొన్నారు. అలాగే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ ఆయన చేశాడు. అలాగే, తన కుటుంబానికి క్యాంటీన్‌ కార్డు ఇప్పించాలని కోరారు. "అమరవీరుల కుటుంబాలకు ₹ 1 కోటి ఇచ్చామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. మాకు అది రాలేదు" అని ఆయన అన్నారు.

Advertisement

Next Story