రెండేళ్లలో ఖతం..! కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ పాలసీ

by karthikeya |
రెండేళ్లలో ఖతం..! కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ పాలసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ పాలసీని రూపొందిస్తున్నది. రెండేండ్ల వ్యవధిలో ఈ సమస్యకు అంతం పలకాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని రివ్యూ చేయడంతోపాటు రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన ఈ నెల 7న ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులు, ఇంటెలిజెన్స్ చీఫ్‌లతో ప్రత్యేక సమావేశానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మావోయిస్టు పార్టీ సహా వివిధ రకాల వామపక్ష తీవ్రవాద పార్టీల కార్యకలాపాలను కట్టడి చేయడంతోపాటు వాటికి అందుతున్న ఆర్థిక మూలాలను పసిగట్టి దెబ్బతీయడం ఈ వ్యూహంలో ప్రధానమైన అంశమని ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి.

సమాచారాన్ని షేర్ చేసుకునేలా..

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు మధ్య ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ పని చేస్తున్నది. కొన్ని రాష్ట్రాల మధ్య కూడా ఇదే తరహా వ్యవస్థ ఉన్నది. ఇక నుంచి వామపక్ష తీవ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న రాష్ట్రాలన్నీ కూడా పరస్పరం ఎప్పటికప్పుడు కదలికలను, సమాచారాన్ని షేర్ చేసుకోవాలనే అంశంపై కేంద్ర హోం మంత్రి ఈ సమావేశంలో నొక్కిచెప్పనున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో ఆ పార్టీ పట్ల ఆదివాసీలు, గిరిజనులు, అటవీ ప్రాంతాల్లోని ప్రజలు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు మారుమూల గ్రామాల్లో సైతం అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లే ప్రణాళికను వివరించనున్నారు. రైలు, రోడ్డు, టెలికాం కనెక్టివిటీని పెంచడంతోపాటు స్కూళ్లు, కమ్యూనిటీ భవనాలు, ప్రభుత్వపరంగా నెలకొల్పే మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలన్నది మరో అంశం. వామపక్ష ప్రభావిత జిల్లాలకు కేంద్రం నుంచి ప్రస్తుతం అందుతున్న నిధులను రానున్న రోజుల్లో మరింతగా పెంచడంతోపాటు నిర్దిష్టమైన డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఖరారు చేయడంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

మావోయిస్టుల కార్యకలాపాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాటిలైట్‌లతోపాటు వివిధ రూపాల్లో నిఘాను పెట్టినప్పటికీ లోకల్ స్థాయిలో ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్ ను కూడా ఇప్పుడున్న స్థాయికంటే మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. కూంబింగ్ ఆపరేషన్లకు వెళ్లే సమయంలో వివిధ రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య సమన్వయం, సమాచారాన్ని షేర్ చేసుకోవడం, కేంద్ర పారా మిలిటరీ బలగాల నుంచి అందాల్సిన సహకారం తదితరాలపైనా కేంద్ర హోం మంత్రి, ఆ శాఖ అధికారులు ఈ సమావేశంలో రాష్ట్రాల ప్రతినిధులకు వివరించనున్నారు.

ఒక రోజు ముందే ఢిల్లీకి సీఎం రేవంత్

ఢిల్లీలో ఈ నెల 7న జరిగే ఈ సమావేశం నేపథ్యంలో ఒక రోజు ముందుగానే (ఆదివారం రాత్రే) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. వామపక్ష తీవ్రవాద సమస్యపై సమావేశం పూర్తికాగానే కేంద్ర హోం మంత్రితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇటీవల సంభవించిన వరదల్లో రాష్ట్రానికి సుమారు రూ. 10 వేల కోట్లకు పైబడి నష్టం జరిగినా, కేంద్ర అధ్యయన బృందం (ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్) వచ్చి పర్యటించి పరిశీలించినా, చివరకు రూ. 416 కోట్లు మాత్రమే మంజూరు కావడంపై హోం మంత్రితో చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు వరద నష్టంపై మధ్యంతర నివేదికను సమర్పించగా శాఖలవారీగా జరిగిన నష్టంపై ఫైనల్ రిపోర్టును ఈ సందర్భంగా అందజేసే అవకాశమున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయా శాఖల మంత్రులతోనూ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌‌తో పాటు రాహుల్‌గాంధీని సైతం సీఎం రేవంత్ కలిసే అవకాశమున్నది.

Advertisement

Next Story