ఆ భూముల అమ్మకానికి టీ సర్కార్ ప్లాన్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సీఎం!?

by karthikeya |   ( Updated:2024-10-05 03:35:48.0  )
ఆ భూముల అమ్మకానికి టీ సర్కార్ ప్లాన్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సీఎం!?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్ గృహకల్ప భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. వాటికి సంబంధించిన భూములు అమ్మేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రప్రాయ అంగీకారం (ఇన్ ప్రిన్స్ పుల్ అప్రూవల్) తెలిపినట్టు సమాచారం. అయితే, ఆ భూములు అమ్మేందుకు ప్రధానంగా అడ్డు వచ్చే సాంకేతిక ఇబ్బందులపై వివరాలు తెలుసుకోవాలని హౌసింగ్ అధికారులకు సీఎం సూచించారు. దీంతో ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు టెక్నికల్ హర్డీల్స్ పై లోతుగా అధ్యయనం చేసే పనిలో పడ్డారు. ఏయో భూములు న్యాయ సంబంధిత ఇబ్బందుల్లో ఉన్నాయో తెలుసుకుంటున్నారు. న్యాయ సంబంధిత ఇబ్బందులు లేని భూములు, ఉన్న భూములను ఒక సమగ్ర నివేదిక తయారు చేస్తున్నారు. దాంతోపాటు, వీటిని అమ్మే క్రమంలో ఎదురయ్యే న్యాయ చిక్కులపై కూడా రిపోర్టు తయారు చేస్తున్నారు. సుమారు 4500 ఎకరాలున్నట్టు చుచాయగా అధికారులు గుర్తించగా.. వీటిని కొంతమేరకు అమ్మి దాదాపు రూ.2,600 కోట్లను రాబాట్టాలని చూస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇలా వచ్చే నిధులను ఇదివరకే సగం కట్టి మిగిలిపోయిన డబుల్ బెడ్ రూం ఇండ్లు, కొత్తగా ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు వినియోగించాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. అయితే, వీటిపై ప్రభుత్వానికి మరికొద్ది రోజుల్లో స్పష్టత లభించే అవకాశం ఉంది. అటు తర్వాత సర్కారు నిర్ణయం తీసుకోనున్నన్నది.

Advertisement

Next Story