సీఎం క్లారిటీతో డైలమాలో బీఆర్ఎస్.. సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిన గులాబీ పార్టీ

by karthikeya |
సీఎం క్లారిటీతో డైలమాలో బీఆర్ఎస్.. సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిన గులాబీ పార్టీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఒక్కసారిగా గప్‌చుప్ అయింది. జనాల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీకి అస్త్రం కరువైంది. నిన్నటివరకు రుణమాఫీ, హైడ్రా, మూసీపై స్పీడ్ పెంచిన గులాబీ పార్టీ సీఎం క్లారిటీతో ఒక్కసారిగా డైలమాలో పడింది. రెండు రోజులుగా మూసీపై ఫీల్డ్ విజిట్ బంద్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఏ అంశంతో మళ్లీ ప్రజల ముందుకు వెళ్లాలనే సమాలోచనలో గులాబీ అధిష్టానం పడింది.

సైలెంట్ మోడ్‌లోకి బీఆర్ఎస్

హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాలుష్యం నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటానికి ‘డబుల్’ ఇండ్లు ఇచ్చి, రూ.25 వేల నగదు సాయం, పిల్లలకు మంచి స్కూల్‌లో చదివించేలా చర్యలు తీసుకుంటూ.. వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని వివరించారు. దీంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా సైలెంట్ అయింది. నిన్నటివరకు రుణమాపీ, హైడ్రా, మూసీపై స్పీడ్ పెంచింది. ఇండ్లు కోల్పోతున్న మూసీ పరివాహక ప్రాంతాల్లో లీడర్లు పర్యటించారు. వారికి భరోసా కల్పించారు. అయితే సీఎం వ్యాఖ్యలతో సీన్ రివర్స్ అయింది. ఎలా ముందుకెళ్లాలో అర్థం కాక పార్టీ సతమతమవుతోంది. ఏ అస్త్రంతో ప్రజల ముందుకెళ్లాలనే డైలమాలో పడినట్లయింది.

అనారోగ్యం బారిన పడ్డ కేటీఆర్!

మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు కోల్పోతున్న, రెడ్ మార్క్ వేస్తున్న ఇండ్ల బాధితులదగ్గరకు వెళ్లేందుకు పార్టీ ప్లాన్ చేసింది. కానీ విజిట్ చేయలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముషీరాబాద్ పర్యటనకు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు కేటీఆర్ సిక్ అయినట్టు సమాచారం. దీంతో పర్యటనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లలేదు. బాధిత ప్రజలంతా కొంత నిరాశకు గురయ్యారు. అయితే ఫీల్డ్ విజిట్ ఆగిపోయిన దానిని తిరిగి కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ కొనసాగుతోంది. రాబోయే గ్రేటర్ ఎన్నికలకు ఈ పర్యటన కలిసి వస్తుందనుకున్న తరుణంలో సీఎం రేవంత్ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు హామీ ఇవ్వడంతో దానిని తిరిగి ఎలా తిప్పికొట్టాలనే ప్రణాళికలు గులాబీ రచిస్తున్నట్టు సమాచారం.

ఏ అంశంపై ముందుకెళ్లాలనే విషయమై పార్టీ ఆరా!

ప్రజల్లోకి ఏ అంశంతో వెళ్లాలనే దానిపై గులాబీ పార్టీ డైలమాలో పడింది. ఇప్పటికే మీడియా వేదికగా 6 గ్యారంటీలు, 420 హామీల అమలుపై నిలదీస్తున్న బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించలేదు. కేవలం విమర్శలకే పరిమితమయింది. క్షేత్రస్థాయిలో ఏ అంశంతో వెళ్లితే ప్రజల నుంచి ఆశించిన స్పందన వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసొస్తుందనే విషయాలపై పార్టీ ఆరా తీస్తున్నట్టు సమాచారం. పెన్షన్, రైతు, మహిళా సమస్యలా? ఏదైతే బాగుంటుందనే దానిపైనా పలువురు లీడర్ల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్టు సమాచారం. దసరా తర్వాత పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతూ..క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తుందనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

రుణమాఫీపై సాగదీత?

బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా రుణమాఫీ అంశాన్ని ఎత్తుకుంది. సందర్భం ఏదైనా ఇదే అంశంపై మాట్లాడుతోంది. అయినా ప్రభుత్వం చేస్తున్నది.. చేయాలనుకున్నదే చేస్తూ ముందుకు వెళ్తోంది. ఎంతమందికి రుణమాఫీ చేశాం.. ఎంతమంది కి చేయాల్సింది.. ఎందుకు ఆలస్యమవుతుందనే వివరాలను ప్రభుత్వపరంగా వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం అదే అంశాన్ని సాగదీస్తూ ముందుకు వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే రెండు మూడు నియోజకవర్గాల్లో స్థానిక నేతల ఇంట్రెస్టుతో మండలకేంద్రాల్లో రైతు ధర్నాలు నిర్వహించారు. ఆ ధర్నాల్లో రుణమాఫీ, రైతుబంధు అంశాలను ప్రస్తావిస్తున్నప్పటికీ రైతుల నుంచి ఆశించిన స్పందన రాలేదనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed