CBI : ఐఏఎస్ స్టడీ సర్కిల్ కేసు.. ఆరుగురు నిందితులకు సీబీఐ కస్టడీ

by Hajipasha |
CBI : ఐఏఎస్ స్టడీ సర్కిల్ కేసు.. ఆరుగురు నిందితులకు సీబీఐ కస్టడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తు వేగాన్ని పుంజుకుంది. ఈ కేసులోని ఆరుగురు నిందితులను నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిశాంత్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. వారిని తిరిగి సెప్టెంబరు 4న కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని నిర్దేశించారు. దీంతో విచారణ నిమిత్తం నిందితులు అభిషేక్ గుప్తా, దేశ్ పాల్ సింగ్, తజీందర్ సింగ్, హర్వీందర్ సింగ్, సరబ్జిత్ సింగ్, పర్వీందర్ సింగ్‌లను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుంది. వీరిలో నలుగురు వ్యక్తులు రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు.

బేస్‌మెంట్‌ను ఏయే అవసరాల కోసం వినియోగించారు ? దాన్ని స్టడీ సర్కిల్ అవసరాల కోసం వాడుకునేందుకు స్థానిక సంస్థల నుంచి పొందిన అనుమతులు ఏమిటి ? అనే అంశాలతో ముడిపడిన సమాచారాన్ని వారి నుంచి రాబట్టడంపై సీబీఐ అధికారులు ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, బేస్‌మెంట్‌ను తాము లైబ్రరీ కోసం వాడలేదని నిందితులు ఇంతకుముందు తమ న్యాయవాది ద్వారా కోర్టుకు తెలియజేశారు. సీబీఐ విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచిచూడాలి.

Advertisement

Next Story

Most Viewed