Cm sukhu: ఇక దేశమంతా నగదు రహిత ప్రయాణం.. కామన్ మొబిలిటీ కార్డ్‌ ప్రారంభించిన సీఎం

by vinod kumar |
Cm sukhu: ఇక దేశమంతా నగదు రహిత ప్రయాణం.. కామన్ మొబిలిటీ కార్డ్‌ ప్రారంభించిన సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రయాణికుల మధ్య నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వింధర్ సుఖూ హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టీసీ)కి చెందిన కొత్త నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ను గురువారం ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా వివిధ ప్రజా రవాణాల్లో నగదు రహిత ప్రయాణానికి అనుమతిస్తుంది. వినియోగదారులకు నగదు లేకుండానే దేశ వ్యాప్తంగా తిరగడానికి వీలు కల్పిస్తుంది. ఢిల్లీ మెట్రో, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, హర్యానా రోడ్‌వేస్, ముంబై బెస్ట్ బస్సులతో సహా ఇతర ప్రయాణాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డు కావాలంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌ఆర్‌టీసీ ఇప్పటికే యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో నగదు రహిత చెల్లింపులను అందిస్తోంది. దీనిని మరింత ప్రోత్సహించడానికి తాజాగా కామన్ మొబిలిటీ కార్డును ప్రారంభించింది.

ఈ సందర్భంగా సీఎం సుఖూ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర రవాణా సంస్థ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని కొనియాడారు. దేశవ్యాప్తంగా వివిధ రవాణా వ్యవస్థలలో ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడం, వినియోగదారుల సౌకర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చినట్టు తెలిపారు. పరిమిత ఇంటర్నెట్ ఉన్న ప్రాంతాల్లోనూ ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. కేవలం ఆరు నెలల్లోనే కార్డును రూపొందించిన హెచ్ఆర్‌టీసీని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి, పరిశ్రమల శాఖ మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed