Chandrayaan-3: 'చంద్రుడి దక్షిణ ధ్రువంపై మానవ కాలనీలు.. మానవ స్థావరాల ఏర్పాటుకు అవకాశాలున్నాయ్'

by Vinod kumar |   ( Updated:2023-08-24 13:55:39.0  )
Chandrayaan-3: చంద్రుడి దక్షిణ ధ్రువంపై మానవ కాలనీలు.. మానవ స్థావరాల ఏర్పాటుకు అవకాశాలున్నాయ్
X

బెంగళూరు: మానవ కాలనీలను సృష్టించే అవకాశం ఉన్నందు వల్లే చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చంద్రయాన్-3 రీసెర్చ్ కోసం ఎంపిక చేశామని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్ వెల్లడించారు. అక్కడ నీరు, ఖనిజ వనరులు కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై అందరికీ చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే.. జాబిల్లిపై ఆవాసాలను సృష్టించాలని మనుషులు అనుకుంటున్నారు. ఇందుకోసం ఉత్తమమైన ప్రదేశం కోసం అన్వేషణ సాగుతోంది. దక్షిణ ధ్రువానికి ఆ అవకాశం ఉందని ఇస్రో భావిస్తోంది’ అని ఆయన వివరించారు. చంద్రుడిపై దిగిన ‘విక్రమ్‌’ ల్యాండర్‌ నుంచి ‘ప్రజ్ఞాన్‌’ రోవర్‌ ఇప్పటికే బయటకు అడుగు పెట్టిందని, అది 14 రోజుల పాటు దక్షిణ ధ్రువంలో నీటి ఉనికి, ఖనిజ వనరుల లభ్యతపై స్టడీ చేస్తుందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో చీఫ్ వెల్లడించారు.

‘ప్రజ్ఞాన్‌’ రోవర్‌ 6 కాళ్లతో చంద్రుడి ఉపరితలం తిరుగుతూ రసాయన, ఖనిజ, లవణ నిల్వల సమాచారాన్ని సేకరిస్తుందని, ఇందుకోసం రోవర్ లో రెండు ప్రత్యేక పరికరాలను అమర్చామని పేర్కొన్నారు. చంద్రయాన్-3 ప్రాజెక్టుతో దక్షిణ ధ్రువంతో ముడిపడిన కీలకమైన శాస్త్రీయ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చంద్రుడి పుట్టుక, అక్కడి పరిస్థితుల గురించి కూడా సమాచారం లభ్యమయ్యే ఛాన్స్ ఉందని ఇస్రో చీఫ్ తెలిపారు. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధనల కోసం సెప్టెంబరు మొదటివారంలో ‘ఆదిత్య మిషన్‌’ ప్రయోగాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మానవసహిత అంతరిక్ష మిషన్‌ ‘గగన్‌యాన్’ కు సంబంధించిన పనులు కూడా పురోగతిలో ఉన్నాయన్నారు. వ్యోమగాములను తీసుకెళ్లే ‘క్రూ మాడ్యుల్‌’, ‘క్రూ ఎస్కేప్‌’ సామర్థ్యాలను పరీక్షించేందుకు సెప్టెంబరు చివరినాటికి లేదా అక్టోబరులో ఒక మిషన్‌ చేపడతామని తెలిపారు. వివిధ పరీక్షల అనంతరం 2025 నాటికి గగన్‌యాన్‌ను నిర్వహించే అవకాశం ఉందన్నారు.

Advertisement

Next Story