Champai Soren: జేఎంఎంకు షాక్.. బీజేపీలో చేరిన చంపై సోరెన్

by vinod kumar |
Champai Soren: జేఎంఎంకు షాక్.. బీజేపీలో చేరిన చంపై సోరెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరారు. రాంచీలోని ధుర్వాలోని షాహీద్ మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం సీఎం హిమంత బిస్వ శర్మ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ ఆధ్వర్యంలో తమ మద్దతు దారులతో కలిసి బీజేపీలో జాయిన్ అయ్యారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. కాగా, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) వ్యవస్థాపకుడు శిబూసోరెన్‌కు అత్యంత సన్నిహితుడైన చంపై జేఎంఎం ప్రాథమిక సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ..చంపై రాకతో బీజేపీ మరింత బలపడుతుందన్నారు. జేఎంఎం ఇప్పుడు బ్రోకర్ల పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.

బీజేపీలో జాయిన్ అయ్యే ముందు చంపై మాట్లాడుతూ..తనకు ఎదురయ్యే ఎటువంటి సవాల్ కైనా భయపడబోనని స్పష్టం చేశారు. ‘నేను శిబు సోరెన్‌తో కలిసి పార్టీని నిర్మించడానికి అవిశ్రాంతంగా పని చేశాను. అయితే, పార్టీ ప్రస్తుత నాయకత్వం ఆదివాసీ వర్గాల సంక్షేమంపై దృష్టిని కోల్పోయిందని, ఇది దాని వ్యవస్థాపక సూత్రాలకు వ్యతిరేకంగా పని చేస్తోందని విమర్శించారు. గిరిజనుల గుర్తింపును కాపాడటానికే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. కాగా, జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే చంపై బీజేపీలో చేరడం జేఎంఎంకు భారీ ఎదురు దెబ్బ అని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Next Story