Broadcasting :‘బ్రాడ్‌కాస్టింగ్ సేవల నియంత్రణ బిల్లు’పై కేంద్రం వెనకడుగు

by Hajipasha |
Broadcasting :‘బ్రాడ్‌కాస్టింగ్ సేవల నియంత్రణ బిల్లు’పై కేంద్రం వెనకడుగు
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘బ్రాడ్‌కాస్టింగ్ సేవల నియంత్రణ బిల్లు- 2024’కు సంబంధించిన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ ముసాయిదా బిల్లులోని పలు నిబంధనలను సమీక్షించి తగిన సవరణలు చేశాక మళ్లీ పార్లమెంటు ముందుకు తీసుకొస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సోమవారం వెల్లడించింది. ఆ బిల్లుతో ప్రభావితమయ్యే అన్ని వర్గాల వారి అభిప్రాయాలు, వాదనలను అక్టోబరు 15 వరకు స్వీకరిస్తామని తెలిపింది. అందరి సిఫార్సులను అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతే తగిన సవరణలతో సరికొత్త ముసాయిదా బిల్లును రూపొందిస్తామని కేంద్రం పేర్కొంది. డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా గత వారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ‘బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసుల నియంత్రణ బిల్లు- 2024’పై ఆందోళన వ్యక్తం చేశాయి.

‘‘ఇంతకుముందు కొన్ని బ్రాడ్ కాస్టింగ్ సేవల కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం నిర్బంధంగా క్లోజ్డ్ డోర్ చర్చలు నిర్వహించింది. అయితే డిజిటల్ మీడియా సంస్థలు, పౌర సంఘాలతో ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది’’ అని పేర్కొన్నాయి. ‘‘ఈ ముసాయిదా బిల్లుకు సంబంధించిన ప్రతులు కావాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖకు లేఖ రాస్తే.. కనీసం వాటిని మాకు పంపలేదు’’ అని డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించాయి. ఈనేపథ్యంలో ఈదఫా డిజిటల్ మీడియా, బ్రాడ్ కాస్టింగ్ సేవలతో ముడిపడిన అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర సర్కారు రెడీ అవుతోంది.

Advertisement

Next Story