2జీ స్పెక్ట్రమ్‌పై 2012 నాటి తీర్పును సవరించాలని కోరిన కేంద్రం

by S Gopi |
2జీ స్పెక్ట్రమ్‌పై 2012 నాటి తీర్పును సవరించాలని కోరిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: 2జీ స్పెక్ట్రమ్ కేసులో తీర్పు వెలువడిన దశాబ్ద కాలం తర్వాత, ఆ తీర్పును సవరించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీ జరగాలని 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ముందుకు కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తక్షణం విచారణ జాబితాలో చేర్చాలని కోరారు. కేంద్ర మంత్రిగా ఏ రాజా 2008లో పలు కంపెనీలకు మంజూరు చేసిన 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సులను రద్దు చేస్తూ 2012, ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పారదర్శకంగా వేల ద్వారానే స్పెక్ట్రమ్ కేటాయించాలని పేర్కొంది. ఈ తీర్పు వచ్చిన 12 ఏళ్ల తర్వాత తీర్పులో మార్పులు చేయాలని కేంద్రం విజ్ఞప్తి చేయడం గమనార్హం. అయితే, దీనిపై వాదనలు వినిపించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. దేశ సహజ వనరులను దుర్వినియోగం కాకుండా ఇచ్చిన తీర్పును సవరించడం కుదరదన్నారు. అయితే, ఈ అభ్యర్థనను మెయిల్ ద్వారా పంపండి, పరిశీలిస్తామని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి ధర్మాసనం పేర్కొంది. 2018లో కేంద్ర మజీ మంత్రి ఎ రాజా, మరో 16 మందిని 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు ప్రకటించడంపై సీబీఐ పిటిషన్ వేసింది. దీన్ని ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో తీర్పులో కొన్ని లోపాలున్నాయని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed