రైల్వే ల్యాండ్ అథారిటీకి రూ.30 కోట్లు కుచ్చుటోపీ

by Vinod kumar |
రైల్వే ల్యాండ్ అథారిటీకి రూ.30 కోట్లు కుచ్చుటోపీ
X

న్యూఢిల్లీ : రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్ఎల్డీఏ)కి రూ.30 కోట్లకు పైగా నష్టం కలిగించిన కేసులో ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో ఆర్ఎల్డీఏ మాజీ మేనేజర్ వివేక్ కుమార్, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ బ్రాంచ్ మేనేజర్ (విశ్వాస్ నగర్ బ్రాంచ్, ఢిల్లీ) జస్వంత్ రాయ్ తో పాటు ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు గోపాల్ ఠాకూర్, హితేష్ కరేలియా, నీలేష్ భట్ ఉన్నారు. వీరిని సోమవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చగా జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఉన్నతాధికారులు ఈ స్కామ్ వ్యవహారాన్ని గుర్తించి సీబీఐకి ఫిర్యాదు చేయడంతో.. దేశంలోని 12 ప్రాంతాల్లో రైడ్స్ చేసి ఈ ఐదుగురిని నిందితులుగా గుర్తించారు.

వివేక్ కుమార్ ఆర్ఎల్డీఏ మేనేజర్ గా పనిచేసిన సమయంలో ఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్వాస్ నగర్ బ్రాంచ్ లో రూ.35 కోట్లను ఏడాది కాలం కోసం ఆర్ఎల్డీఏ అకౌంట్లో ఫిక్సడ్ డిపాజిట్ చేశారు. ఏడాది తర్వాత వడ్డీతో సహా మొత్తం అమౌంట్ ను మూడు నెలల కోసం రీఇన్వెస్ట్ చేయాలనేది ఒప్పందం. కానీ అలా జరగలేదు. ఏడాది తర్వాత కేవలం రూ.3.50 కోట్లే .. మూడు నెలల కోసం ఫిక్స్ డ్ డిపాజిట్ లోకి రీ ఇన్వెస్ట్ అయ్యాయి. మిగతా రూ.31.50 కోట్ల కొన్ని షెల్ కంపెనీల అకౌంట్స్ లోకి దారి మళ్లాయి.

ఆర్ఎల్డీఏ మేనేజర్ వివేక్ కుమార్ అందించిన ఫోర్జరీ లెటర్లు, అడ్వైజరీలను నమోదు చేసి.. షెల్ కంపెనీల అకౌంట్ల నుంచి రూ.31.50 కోట్లను విత్ డ్రా చేసి ఇష్టానుసారంగా వాడేశారు. ఈవిధంగా ఫండ్స్ ను దారి మళ్లించడంలో ఆర్ఎల్డీఏ మేనేజర్ వివేక్ కుమార్ కు, అప్పటి బ్యాంక్ ఆఫ్ బరోడా విశ్వాస్ నగర్ బ్రాంచ్ మేనేజర్ జస్వంత్ రాయ్ సహకరించారు. ఇక షెల్ కంపెనీలకు చెందిన గోపాల్ ఠాకూర్, హితేష్ కరేలియా, నీలేష్ భట్ ల పాత్ర కూడా ఉండనే ఉంది. దీంతో ఈ ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది.

Advertisement

Next Story

Most Viewed