నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు: ఆ స్కూల్ యజమాని అరెస్ట్

by Vinod |
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు: ఆ స్కూల్ యజమాని అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ యూజీ పేపర్ లీక్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరొక వ్యక్తిని అరెస్టు చేసింది. పంచమహల్ జిల్లాలోని గోద్రా సమీపంలో ఉన్న జై జలరామ్ స్కూల్ యజమాని దీక్షిత్ పటేల్‌ను ఆదివారం అదుపులోకి తీసుకుంది. విచారణ అనంతరం ఆయనను అహ్మదాబాద్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కోరనున్నట్టు తెలుస్తోంది. మే 5న నీట్-యూజీ పరీక్ష జరిగిన నిర్ణీత కేంద్రాల్లో జే జలరామ్ స్కూల్ ఒకటి. అభ్యర్థుల నుంచి రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఈ కేసులో అరెస్టైన ఆరో వ్యక్తి దీక్షిత్ కావడం గమనార్హం. అంతకుముందు ఐదుగురు నిందుతులను సీబీఐ అరెస్టు చేసింది. వారందరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఆ వ్యక్తులే సూత్రధారులు!

నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో 13 మంది నిందితులను పాట్నాలోని బీర్ జైలులో సీబీఐ విచారించింది. వారిలో ఆరుగురు పరీక్షల మాఫియాలో భాగం కాగా నలుగురు అభ్యర్థులు, ముగ్గురు తల్లిదండ్రులు ఉన్నారు. దాదాపు నిందితులందరూ సంజీవ్ కుమార్ అలియాస్ సజీవ్ ముఖియా, సికందర్ యాద్వెందుల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. వారే ప్రధాన సూత్రధారులు అని పేర్కొన్నట్టు సమాచారం. అయితే నిందితుల వాంగ్మూలాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ముఖియా ఇంకా పరారీలోనే ఉండటం గమనార్హం.

Next Story