జింబాబ్వేకు బయల్దేరిన భారత ఆటగాళ్లు.. గిల్ వెళ్లాడా? లేదా?

by Harish |
జింబాబ్వేకు బయల్దేరిన భారత ఆటగాళ్లు.. గిల్ వెళ్లాడా? లేదా?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా జింబాబ్వే పయనమైంది. మంగళవారం ఉదయం భారత ఆటగాళ్లు జింబాబ్వేకు బయల్దేరినట్టు బీసీసీఐ వెల్లడించింది. ఫొటోలను బోర్డు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్‌పాండే జింబాబ్వేకు వెళ్లిన వారిలో ఉన్నారు. హెడ్ కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగియగా.. కొత్త కోచ్ శ్రీలంక పర్యటనతో జట్టుతో కలుస్తాడని బీసీసీఐ సెక్రెటరీ జై షా తెలిపారు. జింబాబ్వే టూరుకు జట్టుతో ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ వెళ్తాడని చెప్పారు. భారత ఆటగాళ్లతో లక్ష్మణ్ సైతం జింబాబ్వేకు పయనమయ్యాడు.

అయితే, బీసీసీఐ రిలీజ్ చేసిన ఫొటోల్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కనిపించలేదు. దీంతో జట్టుతో అతను వెళ్లాడా?లేదా? అన్నది తెలియదు. టీ20 ప్రపంచకప్‌ జట్టుకు గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అమెరికాలో భారత్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని రిలీజ్ చేసింది. అయితే, అతను స్వదేశానికి రాలేదని తెలుస్తోంది. అమెరికా నుంచే అతను నేరుగా హరారేకు వెళ్తాడని వార్తలు వస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్ జట్టు సభ్యులు శివమ్ దూబె, సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్‌తోపాటు రిజర్వ్ ప్లేయర్లు రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ జింబాబ్వే టూరుకు ఎంపిక అయ్యారు. అయితే, బెరిల్ హారికేన్ కారణంగా వారు బార్బడోస్‌లోనే చిక్కుకుపోయారు. దూబె, శాంసన్, యశస్వి జైశ్వాల్‌ స్థానాల్లో తొలి రెండు టీ20ల కోసం సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను బీసీసీఐ జట్టులో చేర్చింది. దూబె, శాంసన్, జైశ్వాల్ ఇంటికి వచ్చిన తర్వాత హరారేకు వెళ్తారని పేర్కొంది. అయితే, ఖలీల్ అహ్మద్, రింకు సింగ్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Next Story