50 జంటలకు సామూహిక వివాహాలు జరిపిన అంబానీ

by S Gopi |
50 జంటలకు సామూహిక వివాహాలు జరిపిన అంబానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొద్దిరోజులుగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. జూలై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా అనంత్, రాధిక పెళ్లి వేడుక సందర్భంగా అంబానీ కుటుంబం 50 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన 50 మంది నిరుపేద జంటలకు మంగళవారం సాముహిక వివాహం నిర్వహించారు. థానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో జరిగిన వివాహ కార్యక్రమానికి అంబానీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అలాగే ఈ పెళ్లి వేడుకకు జంటల కుటుంబాలకు చెందిన సుమారు 800 మంది హాజరయ్యారు. ప్రతి జంటకు మంగళసూత్రం, పెళ్లి ఉంగరాలు, ముక్కుపుడకలతో పాటు మెట్టెలు, వెండి పట్టీలు, ఇతర బంగారు ఆభరణాలను అంబానీ కుటుంబం అందజేసింది. వధువులకు రూ. 1.01 లక్షల చొప్పున 'స్త్రీధనం' కింద చెక్కులను అందజేశారు. అంతేకాకుండా జంటలకు ఏడాది సరిపడా కిరాణా సామగ్రి, గృహోపకరణాలు, వివిధ రకాలైన 36 వస్తువులు, పాత్రలు, గ్యాస్ స్టవ్, మిక్సర్, ఫ్యాన్ వంటి ఉపకరణాలు, ఒక పరుపు, దిండ్లు అందించారు. పెళ్లికి హాజరైన వారందరికీ భారీగా విందు ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed