గౌహతి యూనివర్సిటీలో 'క్యాష్ ఫర్ మార్క్స్' స్కామ్

by S Gopi |
గౌహతి యూనివర్సిటీలో క్యాష్ ఫర్ మార్క్స్ స్కామ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో మార్క్‌షీట్‌ల డిజిటల్ ట్యాంపరింగ్ కేసులో క్యాష్-ఫర్-మార్క్స్ వ్యవహారం బయటపడింది. ఈ మార్క్‌షీట్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. గౌహతి యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న గణేష్ లాల్ చౌదరి కాలేజీకి చెందిన విద్యార్థి మార్కుషీట్‌లో తేడాలపై విచారణ సందర్భంగా పోలీసులు స్కామ్‌ జరిగినట్టు కనుగొన్నారు. ఈ వ్యవహారంలో మరికొంతమంది అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అస్సాం మార్కుల కుంభకోణంలో తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా, వారు మార్క్‌షీట్‌ల డిజిటల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. అజీజుల్ హక్ అనే విద్యార్థి మార్క్‌షీట్‌లో తేడాలు రావడంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి అతనికి వచ్చిన మార్కుల కంటే మార్క్‌షీట్‌లో అధిక మార్కులు ఉన్నాయి. ఇన్విజిలేటర్లు మార్కులను తనిఖీ చేసి, ఆపై అతని మార్క్‌షీట్‌ను ఇన్విజిలేటర్లు పంపిన పూర్తి బ్యాచ్ మార్కులతో సరిపోల్చారని సీఐడీ అధికారులు తెలిపారు.

విచారణలో మొదటి, మూడు, నాలుగు, ఐదవ సెమిస్టర్‌లలో మార్కులను మార్చేందుకు రూ. 10,000 చెల్లించినట్టు విద్యార్థి అంగీకరించాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి అనేక రాష్ట్రాల్లో అరెస్టులు జరిగిన నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. దీనిపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ.. గౌహతి యూనివర్శిటీలో మార్క్‌షీట్‌లను నిర్వహించే కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్లు మార్కులు పెంచేందుకు డబ్బు తీసుకుని ఉంటారని అన్నారు. గత ఏడు రోజులుగా ఈ కేసు తన పర్యవేక్షణలోనే జరుగుతోందని, దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. యూనివర్శిటీ ఇంటిగ్రేటెడ్ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐయూఎంఎస్)ను థర్డ్ పార్టీ ఆపరేటర్‌కు అవుట్‌సోర్స్ బాధ్యతలు అప్పగించినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed