Canada: అమెరికాకు కెనడా, మెక్సికో షాక్.. యూఎస్ ఉత్పత్తులపై సుంకాలు పెంపు !

by vinod kumar |
Canada: అమెరికాకు కెనడా, మెక్సికో షాక్.. యూఎస్ ఉత్పత్తులపై సుంకాలు పెంపు !
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా (Canada) , మెక్సికో (Mexico) దేశాల దిగుమతులపై 25శాతం సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కెనడా, మెక్సికోలు యూఎస్‌కు షాక్ ఇచ్చాయి. ట్రంప్ నిర్ణయానికి కౌంటర్‌గా అమెరికా ఇంపోర్ట్స్‌పై ఇరు దేశాలు సుంకాలు పెంచాయి. 155 బిలియన్ డాలర్ల అమెరికన్ దిగుమతులపై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin trueado) ప్రకటించారు. 30 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఇంపోర్ట్స్‌పై కొత్త సుంకాలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని,125 బిలియన్ డాలర్ల విలువైన వాటిపై మరో 21 రోజుల్లో అమలులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కెడియన్ల కోసం పని చేయడంతో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. అమలు కాని టారిఫ్ చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఈ టైంలో కెనడియన్లు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముఖ్యమైన ఖనిజాలు, శక్తి సేకరణ, ఇతర భాగస్వామ్యాలకు సంబంధించిన కొన్నింటితో సహా అనేక నాన్-టారిఫ్ చర్యలను మేము పరిశీలిస్తున్నామని తెలిపారు.

మెక్సికో సైతం

మెక్సిలో సైతం అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగింది. యూఎస్ దిగుమతులపై తాము కూడా సుంకాలు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ ( Claudia Sheinbaum) వెల్లడించారు. ఈ మేరకు తమ దేశ ఆర్థిక మంత్రికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. క్రిమినల్ సంస్థలతో మెక్సికోకు సంబంధం ఉందంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న క్రిమినల్ సంస్థలతో మెక్సికోకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. అమెరికా ఈ సంస్థలతో వ్యవహరించాలనుకుంటే, మనం కలిసి పనిచేయాలని సూచించారు. సుంకాలు విధించడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు.

కాగా, కెనడా, మెక్సికోలతో అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉంది. అయితే ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికోలపై 25శాతం, చైనాపై 10శాతం అదనపు టారిఫ్‌లను విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇవి మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు సైతం ప్రతీకార చర్యలకు దిగాయి. మరోవైపు చైనా (China) సైతం దీనిపై స్పందించింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికా నిర్ణయాన్ని సవాల్ చేస్తామని హెచ్చరించింది. అమెరికా ఏకపక్షంగా సుంకాలు పెంచడం డబ్లూటీఓ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Next Story

Most Viewed