"నిన్ను ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా’’.. టీచర్‌ని బెదిరించిన బీహార్ పోలీస్

by Mahesh |   ( Updated:2023-05-14 02:22:53.0  )
నిన్ను ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా’’.. టీచర్‌ని బెదిరించిన బీహార్ పోలీస్
X

జముయ్ (బీహార్) : "నిన్ను ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా’’ అంటూ పోలీసు అధికారి ఒక టీచర్ ను అందరూ చూస్తుండగా బెదిరించాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని జముయ్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఓ వివాదానికి సంబంధించిన సెటిల్మెంట్ చేసుకునేందుకు ఒక ఉపాధ్యాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి జముయ్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. వారిని చూడగానే లేచి నిలబడి పోలీస్ ఆఫీసర్ రాజేష్ శరణ్ కోపగించుకున్నాడు. తాను చెప్పిన టైం కంటే మూడు రోజులు ఆలస్యంగా వచ్చావంటూ అరిచి గోల పెట్టాడు. సమాధానం చెప్పేందుకు టీచర్ యత్నించగా.. మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వన్ సైడ్ లో క్లాస్ పీకడం కంటిన్యూ చేశాడు.

ఈ క్రమంలోనే కోపాన్ని పీక్స్ కు పెంచుకొని.. "ప్రజలను తీవ్రవాదులుగా ప్రకటించడమే మా పని.. ఒక్క సెకనులో నిన్ను కూడా ఉగ్రవాదిగా ప్రకటిస్తా" అని రాజేష్ శరణ్ కామెంట్ చేశారు. దీనిపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరికీ గౌరవం ఇవ్వాలని.. పోలీస్ ఆఫీసర్ ఓవర్ యాక్షన్ చేశాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story