Bulldozer Action : గ్యాంగ్‌రేప్ నిందితుడి బేకరీపై బుల్డోజర్ యాక్షన్

by Hajipasha |
Bulldozer Action : గ్యాంగ్‌రేప్ నిందితుడి బేకరీపై బుల్డోజర్ యాక్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అధికారులు బుల్డోజర్ చర్యను చేపట్టారు. అయోధ్య పరిధిలోని పురకలందర్ ఏరియాలో పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే అభియోగాన్ని ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మోయిన్ ఖాన్ బేకరీని బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో ఈ చర్యను చేపట్టారు. ఈసందర్భంగా బేకరీలోని ఫుడ్ ఐటమ్స్‌ శాంపిళ్లను అధికారులు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. బేకరీకి సీల్ వేశారు. ఇక ఇదే సమయంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) రెవెన్యూ అధికారులతో కలిసి వచ్చి నిందితుడు మోయిన్ ఖాన్ ఇల్లు, భూమికి సంబంధించిన కొలతలను సేకరించారు.

మోయిన్ ఖాన్‌కు అక్రమాస్తులు ఉంటే తప్పకుండా సీజ్ చేస్తామని శుక్రవారం రోజు బాధిత బాలిక తల్లికి సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలో అధికారులు మోయిన్ ఇంటి కొలతలను సేకరించడం గమనార్హం. ఈ ఘటనను యూపీ అసెంబ్లీలోనూ లేవనెత్తిన సీఎం ఆదిత్యనాథ్.. మోయిన్ ఖాన్‌పై సమాజ్‌వాదీ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దోషులు ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బేకరీకి వచ్చిన పన్నెండేళ్ల బాలికపై మోయిన్ ఖాన్, ఆ షాపులో పనిచేసే ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో పుర కలందర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రతన్ శర్మ, భదర్సా ఔట్ పోస్ట్ ఇన్‌ఛార్జి అఖిలేష్ గుప్తాలను సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story