Haryana: మోసం చేసినందుకే దేవుడు ఆమెను శిక్షించాడు: బ్రిజ్ భూషణ్

by Harish |   ( Updated:2024-09-07 06:22:05.0  )
Haryana: మోసం చేసినందుకే దేవుడు ఆమెను శిక్షించాడు: బ్రిజ్ భూషణ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఒక రోజు తర్వాత రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ శనివారం వారిపై విరుచుకుపడ్డారు. వినేశ్ ఫొగాట్ ఒలంపిక్ పోటీలకు ఆడేందుకు మోసం చేశారు, అందుకే ఆమెను దేవుడు శిక్షించినందున పతకం గెలవలేకపోయిందని భూషణ్ అన్నారు. ఒక ఆటగాడు ఒకే రోజులో రెండు వెయిట్ కేటగిరీల్లో ట్రయల్స్ ఇవ్వగలడా అని వినేశ్ ఫొగాట్‌ను అడగాలనుకుంటున్నాను, మీరు రెజ్లింగ్‌లో గెలవలేదు, మోసం చేసి అక్కడికి వెళ్ళారు. అందుకే దేవుడు శిక్షించాడని ఫొగాట్‌పై బ్రిజ్ భూషణ్ ఆరోపణలు చేశారు.

మరోవైపు భజరంగ్ పూనియాను విమర్శిస్తూ, ట్రయల్స్ పూర్తి చేయకుండానే అతను ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడని ఆరోపించారు. స్పోర్ట్స్ రంగంలో హర్యానా భారతదేశానికి కిరీటం లాంటిది, భజరంగ్ ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడలకు వెళ్లింది నిజం కాదా? నేను రెజ్లింగ్‌లో నిపుణులైన వారిని అడగాలనుకుంటున్నానని భూషణ్ అన్నారు. అలాగే, గతంలో వీరు చేసిన నిరసన మల్లయోధుల నిరసన కాదని, దాని వెనుక కాంగ్రెస్ ఉందని ముందే చెప్పాను. ఇప్పుడు అది నిజమని నిరూపించబడిందని ఈ సందర్భంగా చెప్పారు.

నాపై జరిగిన నిరసన, కుట్రలో కాంగ్రెస్ ప్రమేయం ఉంది. దీనికి భూపిందర్ హుడా నాయకత్వం వహించారు. దీపేందర్ హుడా, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా గౌరవం కోసం నిరసనలు చేయలేదని నేను హర్యానా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. దీనివల్ల హర్యానాలోని ఆడపిల్లలు అవమానం ఎదుర్కోవాల్సి వస్తోందని భూషణ్ ఆరోపించారు. ఆరోపణలు, నిరసనల నేపధ్యంలో, మూడుసార్లు బీజేపీ ఎంపిగా ఉన్న ఆయనకు ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంట్ స్థానం నుండి లోక్‌సభ ఎన్నికలకు టిక్కెట్ నిరాకరించి, బదులుగా అతని కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌ను రంగంలోకి దించారు.

Advertisement

Next Story