Brain-dead: ఆరుగురి ప్రాణాలు కాపాడిన బ్రెయిన్ డెడ్ పేషెంట్.. రాజస్థాన్‌లో చారిత్రక శస్త్ర చికిత్స

by vinod kumar |
Brain-dead: ఆరుగురి ప్రాణాలు కాపాడిన బ్రెయిన్ డెడ్ పేషెంట్.. రాజస్థాన్‌లో చారిత్రక శస్త్ర చికిత్స
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రెయిన్ డెడ్ (Brain-dead) పేషెంట్ అవయవాలు ఆరుగురి ప్రాణాలు కాపాడాయి. ఈ కీలకమైన అవయవమార్పిడి ఆపరేషన్ రాజస్థాన్‌(Rajasthan)లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ఝలావర్ జిల్లా మన్‌పురా పిపాజీకి చెందిన 33 ఏళ్ల విష్ణు ప్రసాద్ అనే దాత డిసెంబరు10న జరిగిన ఓ ఘర్షణలో గాయపడ్డాడు. అనంతరం12న అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలోనే విష్ణు అవయవాలను దానం చేసేందుకు వారి కుటుంబం అంగీకరించింది. దీంతో వైద్యులు అవయవాలను మార్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఝలావర్ నుంచి జైపూర్, జోధ్‌పూర్‌లకు ఆర్గాన్స్‌ను విమానంలో తరలించి శస్త్ర చికిత్స నిర్వహించారు. జైపూర్‌లోని రోగులకు ఒక కిడ్నీ, రెండు ఊపిరితిత్తులు, గుండెను అమర్చగా, మరో కిడ్నీ, కాలేయాన్ని జోధ్‌పూర్ ఎయిమ్స్‌కు పంపినట్టు సవాయ్ మాన్ సింగ్ (SMS) హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దీపక్ మహేశ్వరి తెలిపారు. అవయవాలను తీసుకెళ్తున్న హెలికాప్టర్ జైపూర్‌లోని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీలో ల్యాండ్ అయిందని, అక్కడి నుంచి అవయవాలను ఆస్పత్రికి తరలించడానికి గ్రీన్ కారిడార్ సృష్టించినట్టు వెల్లడించారు. ఎయిర్ లిఫ్ట్ ద్వారా మాత్రమే సమర్థవంతంగా అవయవమార్పిడి చేయడానికి మార్గం సుగమం అయిందని తెలిపారు. అవయవ దానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులను వైద్యులు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed