బ్రహ్మోస్.. ఇకపై మా ప్రాథమిక ఆయుధం : నేవీ చీఫ్

by Hajipasha |
బ్రహ్మోస్.. ఇకపై మా ప్రాథమిక ఆయుధం : నేవీ చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇకపై తమ ప్రాథమిక ఆయుధం ‘బ్రహ్మోస్’ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణే అని భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ తెలిపారు. నౌకాదళం కోసం ఇతర దేశాల నుంచి సేకరించిన పాత క్షిపణి వ్యవస్థ స్థానంలో బ్రహ్మోస్ మిస్సైళ్లు వినియోగంలోకి వస్తాయని వెల్లడించారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఈ క్షిపణులు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. నౌకాదళం మోహరించిన పాత క్షిపణులన్నింటినీ సాధ్యమైనంత త్వరగా బ్రహ్మోస్‌ మిస్సైళ్లతో భర్తీ చేస్తామని ఆర్.హరికుమార్ తెలిపారు. బ్రహ్మోస్‌ను ప్రస్తుతం భారతదేశంలోనే తయారు చేస్తున్నారన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘బ్రహ్మోస్‌ క్షిపణుల నిర్వహణ కోసం మనం ఏ దేశంపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. మనమే ఇన్‌స్టాల్ చేసుకోగలం. మనమే రిపేర్ చేసుకోగలం. విడిభాగాలు కూడా మనమే తయారు చేసుకోగలం. అందుకే ఈ మిస్సైళ్లు మనకు ప్రయోజనకరం’’ అని ఆర్.హరి కుమార్ వివరించారు. భారత సైన్యం కోసం 200 బ్రహ్మోస్ మిస్సైళ్ల కొనుగోలుకు సంబంధించిన రూ.19వేల కోట్ల ఒప్పందంపై మార్చి 5న రక్షణ శాఖ సంతకం చేయబోతోంది. ఈ డీల్‌కు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తాజాగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ పైవ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పో ముగింపు వేడుకల సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed