మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ షిండే: ఇంకా తేలని సీట్ల పంచాయితీ!

by samatah |
మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ షిండే: ఇంకా తేలని సీట్ల పంచాయితీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయ పార్టీలు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆయా పార్టీల తరఫున టికెట్లు పొందిన అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. పార్టీల అగ్రనేతలు సైతం ప్రచారానికి షెడ్యూల్ రూపొందించి ముందుకు సాగుతున్నారు. అయితే మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మాత్రం సీట్ల పంచాయితీ ఇంకా తేలడంలేదు. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, శివసేన(శిండే)ల మధ్య సీట్ల పంపకం విషయంలో పెద్ద యుద్ధమే నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలు ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో బీజేపీ, షిండే వర్గాలకి చెందిన శివసేన నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. సీట్ల పంపకంపై పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. రాష్ట్రంలోని మొత్తం 48 స్థానాలకు గాను బీజేపీ 29, శివసేన 13, ఎన్సీపీ(అజిత్ పవార్) 6 స్థానాల్లో బరిలోకి దిగుతాయని భావించాయి. అయితే షిండే వర్గం 22సీట్లు కావాలని పట్టుబట్టింది. కానీ చర్చల అనంతరం ఈ ప్రతిపాదనకు షిండే ఒప్పుకున్నారని పలువురు బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఫైనల్ లిస్టు రాకపోవడంతో ఆందోళన నెలకొంది.

నాలుగు స్థానాలపై పట్టువీడని శివసేన

2014, 2019 ఎన్నికల్లో శివసేన పోటీ చేసి గెలుపొందిన కళ్యాణ్, థానే, నాసిక్, సిందుదుర్గ్ రత్నగిరి సీట్లపై బీజేపీ కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి పలు సర్వేలు అక్కడ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవ్వగా అందుకు సీఎం షిండే అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. కళ్యాణ్ స్థానం నుంచి ప్రస్తుతం షిండే కుమారుడు శ్రీకాంత్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో బీజేపీ ప్రతిపాదనకు అంగీకరిస్తే శివసేన నాయకులకు తప్పుడు సంకేతం వెళ్తుందని, అందుకే ఈ సీట్లపై షిండే పట్టువీడటం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో ఈ సీట్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

షిండే వర్గంలో ఆందోళన?

సీట్ల పంపకాల విషయంలో బీజేపీ, శివసేన (షిండే)ల మధ్య వాగ్వాదం కారణంగా షిండే వర్గంలోని సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మహావికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ) తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. కానీ అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో ఇంకా సీట్ల పంపకంపై క్లారిటీ రాకపోవడంతో షిండే వర్గంలోని నేతలు ఆందోనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానానికి విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలోని మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఈ పరిణామాలపై శివసేన(యూబీటీ) నాయకుడు రావుసాహెబ్ స్పందించారు. (బీజేపీతో చర్చలు జరపడం అంత సులభం కాదు. ఈ విషయాన్ని షిండే గ్రహించాలి. ఉద్ధవ్ థాక్రే బీజేపీతో సరైన విధంగా వ్యవహరించారు. కానీ షిండే విఫలమయ్యాడు’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed