బీజేపీ స్ట్రాటజీ షురూ!: ఈనెల14 నుంచి మోడీ దేశ వ్యాప్త పర్యటన, ఆ రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్

by samatah |
బీజేపీ స్ట్రాటజీ షురూ!: ఈనెల14 నుంచి మోడీ దేశ వ్యాప్త పర్యటన, ఆ రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాల వంటి వాటిపై దృష్టి పెట్టాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఎలక్షన్స్‌కు వ్యూహం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 14వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పర్యటించనున్నారు. జవవరి 14 నుంచి ఫిబ్రవరి చివరి వరకు ఈ టూర్ కొనసాగనుంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయడమే మోడీ టూర్ ప్రధాన లక్ష్యమని సన్నిహిత వర్గాలు తెలిపాయి. పర్యటనల్లో భాగంగా మోడీ వివిధ ర్యాలీల్లో పాల్గొంటారు. అంతేగాక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, మరికొన్ని భారీ ప్రాజెక్టులను సైతం మోడీ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైనట్టు సమాచారం.

ఆ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి

ఫిబ్రవరి నెలాఖరులోపు ప్రధాని మోదీ చాలా రాష్ట్రాల్లో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని రాష్ట్రాలను కవర్ చేసి.. ఒక్కో రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, బహిరంగ సభల్లో ప్రసంగించడం వంటి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. మోడీ ప్రభుత్వ పనితీరును, సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు ఈ టూర్ ఓ శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించనున్న తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అంతేగాక ఆయా రాష్ట్రాల్లో 150 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో మోడీ పర్యటన ఉండేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నది. అలాగే, జనవరి 22న జరిగే రామమందిర ప్రతిష్టాపన తర్వాత మోడీ 2024 ఎన్నికలకు బలమైన సందేశాన్ని ఇవ్వనున్నారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బిహార్, యూపీ, మహారాష్ట్రలో అత్యధిక పర్యటనలు

దేశంలో ఎక్కువ లోక్ సభ సీట్లను కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్(80), మహారాష్ట్ర(48) అలాగే 40లోక్ సభ సీట్లు ఉన్న బిహార్‌లలో ప్రధాని రెండు లేదా మూడు సార్లు పర్యటించనున్నారు. చిన్న రాష్ట్రాలను మాత్రం ఒకే సారి సందర్శిస్తారు. బిహార్, యూపీల్లో అత్యధిక సంఖ్యలో పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారంలో ఉన్నందున అది కాషాయ పార్టీకి కలిసి వచ్చే చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీకి మోడీ పర్యటన ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story